ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు రాష్ట్రంలోని అధికార వైసీపీతో తెరవెనుక అంటకాగిన బీజేపీ అధిష్ఠానం ఇప్పుడు రూట్ మార్చుకుంది. ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మరింతగా మారిన పరిస్థితులతో వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ తలుపులు మూసేసినట్లుగా అర్థం అవుతోంది. ప్రజాదరణ కనిపిస్తున్న టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టీడీపీ – జనసేన కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అందుకే దానిపై చర్చలు, సీట్ల సర్దుబాటు కోసం చంద్రబాబును అమిత్ షా ఢిల్లీకి ఆహ్వానించారు.
ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అమిత్ షాను కలవాలని ఢిల్లీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. జగన్.. అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం వారం రోజులు వెయిట్ చేసినప్పటికీ.. అమిత్ షా నుంచి పిలుపు రాలేదు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. అదే సమయంలో చంద్రబాబుకు అమిత్ షా నుంచి ఫోన్ రావడం.. ఢిల్లీకి రావాలని పిలవడంతో.. కేంద్రం వైఖరి ఏంటనేది స్పష్టంగా అర్థం అవుతోంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి బీజేపీ తలుపులు మూసేసినట్లుగా భావిస్తున్నారు.
తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చంద్రబాబును అమిత్ షా ఢిల్లీకి పిలవడంతో జగన్ కేంద్రంపై వ్యతిరేకత కనబర్చడం మొదలుపెట్టారు. మంగళవారం నాటి అసెంబ్లీలో కూడా జగన్ ప్రసంగంలో కేంద్రంపై విమర్శలు కనిపించాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారనగానే.. మునుపెన్నడూ లేని తరహాలో జగన్ కేంద్రంపై స్వరం పెంచారు. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు. కొన్నాళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని.. 2015-2020 మధ్య కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధులు రాలేదని వివరించారు. ఏపీకి 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థికం చెబితే.. కేంద్రం కేవలం 35 శాతం మాత్రమే ఇచ్చిందంటూ లెక్కలు చెప్పారు.. 2020-25 మధ్య 41 శాతం నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచిస్తే.. కేంద్రం మాత్రం 31.15 శాతం నిధులే ఇచ్చిందని క్లియర్ గా లెక్కలతో చూపించారు.
దీంతో ఈ లెక్కలను ఇన్నాళ్లు ఎందుకు జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టలేదనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిరాకరణ ఎదురయ్యేసరికి జగన్ మోహన్ రెడ్డికి ఈ లెక్కలన్నీ గుర్తుకు వచ్చాయా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని బట్టి టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో భయం ఉందో స్పష్టం అవుతోంది. తనకు బీజేపీ మద్దతు తగ్గిపోతుందనే ఆవేదనతో రాబోయే రోజుల్లో జగన్ ఇంకెలాంటి స్వరాలు మార్చుతారో అనే ఆసక్తి నెలకొంది.