ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన P-4 కార్యక్రమానికి రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ – CGB నాంది కాబోతుందన్నారు మంత్రి నారా లోకేష్. CGB స్థాపనతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తొలి అడుగుపడిందన్నారు. ప్రకాశం జిల్లా PCపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ CGB ప్లాంట్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేశారు.పేదరికాన్ని తొలగించాలనే ఉద్దేశంతోనే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు లోకేష్ . గడిచిన ఐదేళ్లు వైసీపీ వాళ్లు చేయలేదు. చేసే వారిని చేయనీయలేదంటూ ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పనకు తెచ్చిన పరిశ్రమలను అడ్డుకుంటే రెడ్‌బుక్‌లోకి పేరు ఎక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తే వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు.
ఉమ్మడి అనంతపురంలో ఆటోమొబైల్ హబ్, చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, కర్నూలుకు పునరుత్పత్తి ఇంధన కంపెనీ, ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లును తీసుకొస్తే గత ప్రభుత్వం రానివ్వలేదన్నారు లోకేష్. గడిచిన ఐదేళ్లు వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం విలయతాండవం చేసిందన్నారు. కొత్త కంపెనీలు తీసుకురాకుండా అప్పటికే వచ్చిన లులు, HSBC, జాకీ వంటి కంపెనీలను వాటాల పేరుతో బెదిరించి తరిమేశారని ఆరోపించారు. మీరు తీసుకొచ్చిన కంపెనీ పేరు చెప్పాలని నాడు ముఖ్యమంత్రి ఉన్న పులివెందుల ఎమ్మెల్యేను అడిగితే అటు నుంచి సౌండ్ కూడా లేదన్నారు లోకేష్.
గంగాధర నెల్లూరులో పాదయాత్ర చేసినప్పుడు ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఆమె కోరిక మేరకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టామన్నారు లోకష్. రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇప్పటి వరకు ఒప్పందాలు జరిగాయన్నారు. అందులో భాగంగానే రిలయన్స్, NTPC, టాటాపవర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, CBG, BPCL, మిత్తల్ కంపెనీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయన్నారు.
రిలయన్స్ సంస్థ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి సీఎం చంద్రబాబుకు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు లోకేష్. ఓసారి గుజరాత్ వెళ్లినప్పుడు టెలికాం రంగంలో విప్లవం రాబోతోందని చెప్పడంతో ధీరుభాయ్ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టారని లోకేశ్ గుర్తుచేశారు. అనంత్ అంబానీకి తాను ఇచ్చిన మాట మేరకు 30 రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని, వలసలు ఆపాలని పాదయాత్ర సమయంలో ఉగ్ర నరసింహారెడ్డి కోరడంతోనే మొదటి ప్లాంట్ కనిగిరి నియోజకవర్గానికి తెచ్చామని వివరించారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని, 2.50 లక్షలమంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని ఐదు లక్షల ఎకరాల బీడు భూములు వినియోగంలోకి తీసుకురానున్నామని చెప్పారు. నేపియర్ గడ్డితో బయోగ్యాస్ తయారు చేస్తారని, ప్రభుత్వ భూములను కౌలుకు ఇస్తారని, రైతులే గడ్డి పెంచితే సొమ్ము చెల్లిస్తారని వివరించారు. ఈ ప్లాంట్లతో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువు తయారుతుందన్నారు.