ఆయన ఓ నట శిఖరం.. నాట్య మయూరం. ఇంకెవరు.. మన కమల్ హాసన్ అండీ. నిజానికి ఆయన ఓ స్వాతి ముత్యం.. ఆయన ఓ నాయకుడు.. మరో భారతీయుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు.
విలక్షణ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఆయనో ప్రయోగాల పుట్ట.. వైవిధ్యమైన కథల్ని విలక్షణమైన రీతిలో తెరమీద సాక్షాత్క రింపచేయడంలో దిట్ట. నటననూ, నాట్యాన్నీ ఓ సాగర సంగమంలో కలిపి ఆ శుభసంకల్పంతోనే అడుగులు వేస్తున్న ధీశాలి. ఆయన నటన దాహం తీరని.. అందుకే తపించిపోతుంటారు.. ఎవరూ చేయని పాత్రల్ని ఎప్పుడూ కోరుకొనే ఆ అపురూప నటుడు తన యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో వేయని వేషం లేదు. చేయని పాత్ర లేదు. తమిళ ప్రేక్షకులు ఉలగనాయకన్ అని, తెలుగు వారు లోకనాయకుడని ముద్దుగా పిలుచుకొని మురిసిపోతారు. ఈ నవంబరు 7 ఆయన 66వ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఆయన గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. కమల్ హాసన్.. అనే వ్యక్తి అమావాస్య చంద్రుడు.. కాదు నిజానికి ఆయన పౌర్ణమి చంద్రడు. ఎత్తు పళ్ళతో ‘కళ్యాణ రాముడు’ గా వినోదం పంచాడు. దివ్యాంగుడిగా శ్రీదేవి పదహారేళ్ళ పరువాన్ని వరించాడు. అంధుడిగా ప్రేమరాగాన్ని ఆలపించాడు. మందబుద్ధితో ‘స్వాతిముత్యం’ అనిపించుకున్నాడు. నాట్యపటిమతో సాగర సంగమాన్ని తలపించాడు. మరుగుజ్జుగా ప్రతికారాన్ని తీర్చుకున్నాడు. అవినీతి మేయరైనా.. ప్రజల దృష్టిలో ఇంద్రుడ నిపించుకున్నాడు. వికలాంగుడైన మానవతా వాదిగా సత్యమే శివం అనిపించాడు.
లంచగొండుల బెండుతీసే భారతీయుడయ్యాడు.. కూటి కోసం కూలికోసం పట్టణంలో బతుకుదామని నిరుద్యోగుల ఆకలిరాజ్యంలోకి బైలుదేరిన బాటసారి. లేనివారిని ఆదుకొని వారికి నాయకుడయ్యాడు. ఏకంగా పదిపాత్రలతో తన నట దశావతారాన్ని చూపించి ప్రేక్షకుల్ని అబ్బర పరిచారాయన. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే కాకుండా. పరభాషా ప్రేక్షకుల్నీ అలరించడం కమల్ హాసన్ కు పరిపాటి. అరవైయేళ్ళ క్రితమే కమల్ హాసన్ ‘కళత్తూరు కన్నమ్మ’ తమిళ చిత్రంతో బాలనటుడిగా తమిళ రంగ ప్రవేశం చేశారు. అందులో సావిత్రి, జెమినీ గణేశన్ ల కొడుకుగా నటించి.. సత్తా చాటుకున్నారు.
1970 నుంచి కమల్ హాసన్ .. వివిధ చిత్రాల్లో రకరకాల పాత్రలు చేస్తూ .. తెరమీద కనిపించినా.. 1975లో కానీ ఆయనకి హీరోగా బ్రేక్ రాలేదు. ఆ సంవత్సరమే కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో తూర్పుపడమర) చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేశారు . అదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఒకో సినిమాతో ఒక మెట్టూ ఎక్కుతూ.. వివిధ భాషల్లోనూ నటిస్తూ.. లోకనాయకుడయ్యారు.
కమల్ హాసన్ ఇప్పటివరకూ వివిధ భాషల్లో దాదాపు 260 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఆయనకి కలైమామణి బిరుదుతో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన దాదాపు 170 వరకూ అవార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే.. తమిళ బిగ్ బాస్ లో హోస్ట్ లో చేస్తున్నారు. మరో పక్క ఆయన రాజకీయాల్లోనూ బిజీగా మారారు. ‘మక్కళ్ నీది మయ్యం’ అనే పార్టీ స్థాపించి.. తమిళ ప్రజలకు సేవ చేసే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది లియో న్యూస్ .