భారతీయ జనతా పార్టీ తెలుగు అధ్యక్షుల పనితీరుపై ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ‘అబ్బే… మీ పని తీరు బాగోలేదు..’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జే.పీ.నడ్డా పెద్దవి విరిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణా నూతన అధ్యక్షుడు బండి సంజయ్ వొంటెద్దు పోకడలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయని అంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బండి సంజయ్ ఒక్కరే తిరుగుతున్నారు తప్ప తమను కలుపుకోవడం లేదని పార్టీ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏకంగా హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేయలేదని, తెలంగాణాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సమాలోచనలు చేయలేదని తెలంగాణా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇదే విషయమై వివరణ అడిగితే తాను అధ్యక్షుడు కావడం ఇక్కడి సీనియర్ లకు ఇష్టం లేదని, అందుకే వారు తనకు సహకరించడం లేదంటూ బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు నడ్డాకు తెలియజేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ పటిష్టమవడం మాట రాముడెరుగు… ఇక్కడి వివాదాలతో ఉన్న క్యాడర్ కూడా చేజారుతుందా అనే అనుమానం అధిష్టానం వర్గాల్లో వ్యక్తం అవుతోందని అంటున్నారు. దీనిపై అధిష్టానం అంతర్గతంగా ఓ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీలో కుల భజన
ఆంధ్రప్రదేశ్ పార్టీ పరిస్థితి తెలంగాణాకు భిన్నంగా ఉందంటున్నారు. అక్కడ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కేవలం తన కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. అక్కడి పార్టీ సీనియర్లతో కలివిడిగా ఉన్నట్ల కనిపించినా… లోలోపల మాత్రం తమ కులం వారినే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ అంతటా తెలిసిందని, చివరికి హర్షకుమార్ వంటి సీనియర్ నాయకుడు బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే చిరంజీవిని ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించే స్థితికి పార్టీ వచ్చిందంటూ సీనియర్లు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
గతంలో పార్టీ సీనియర్ నాయకుడు, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడితో ఉన్న విబేధాల కారణంగా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిని పక్కన పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైతే అన్ని వర్గాల వారికి సన్నిహితంగా ఉంటారని భావించిన కమలనాథులకు ప్రస్తుత పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాల్సింది పోయి ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా మిన్నకుండిపోతున్నారని అంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతోను చర్చించి పార్టీ పటిష్ట పరిచే దిశగా అడుగులు వేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.











