తెలంగాణలో దుబ్బాక గెలుపు, జీహెచ్ఎంసీలో గణనీయమైన ఫలితాలు సాధించి దూకుడు మీదున్న బీజేపీకి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక సవాలు గానే మారింది. దుబ్బాకలో గెలిచినట్టుగానే ఇక్కడా గెలుస్తామని బీజేపీ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రస్తుతానికి భిన్నంగా ఉన్నాయి. దుబ్బాకలో బీజేపీకి రఘునందన్ ఒక్కరే బలమైన అభ్యర్థిగా ఉండడం, గతంలో వరుస ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో సానుభూతి అంశం కూడా బీజేపీకి కలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో చెరకు శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి రప్పించుకుని బరిలోకి దింపింది. కాని నాగార్జునసాగర్ పరిస్థితి వేరు. సామాజిక పరిస్థితులు వేరు. ప్రభావిత అంశాలు వేరు. గజ్వేల్, సిద్దిపేటల్లాంటి భౌగోళిక ప్రభావిత అంశాలు ఇక్కడ లేవు. మరోవైపు కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు (ఇప్పటి వరకు) జానారెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడికి ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం నడిచినా అది జరగలేదు. ఈ నేపథ్యంలో అక్కడి బీజేపీ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. అక్కడ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితరెడ్డి ప్రచారం మొదలుపెట్టడం గమనించాల్సిన విషయం. ఇక బీజేపీలో అభ్యర్థుల విషయానికి వస్తే.. బలమైన నేతలను దిగుమతి చేసుకుని వారికి టిక్కెట్ ఇవ్వడం ప్రధాన అంశం. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
మూడు పేర్లు..కాని..
బీజేపీలో ప్రస్తుతం ఉన్నవారి పేర్లతో పాటు టీఆర్ఎస్ నుంచి ఒకరు వస్తే..ఆయనకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతోంది. బీసీ నేతగా పేరున్నకడారి అంజయ్యయాదవ్ పేరు ప్రథమంగా వినిపిస్తోంది. గతంలో 2014 టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన అంజయ్య యాదవ్ 27,852 ఓట్లు సాధించారు. 2018లో బీజేపీలో చేరారు. బీసీ సామాజికవర్గం కావడం, నియోజకవర్గంలో ఆ ఓట్లు కూడా భారీగానే ఉండడంతో టిక్కెట్ ఆశిస్తున్నారు. అంజయ్య యాదవ్‌కి జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి నేతృత్వంలోని సీనియర్ల మద్దతు ఉండడం, కొంత సానుభూమి ఉండడం సానుకూల అంశాలు. అభ్యర్థిత్వంలో భాగంగా కొన్ని రోజుల క్రితం హాలియాలో అంజయ్యయాదవ్ ఓ పూజాకార్యక్రమం నిర్వహించి చాలామంది నాయకులను పిలిచారు. ఇదే నియోజకవర్గంలో రేసులో ఉన్న ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి భార్య కంకణాల నివేదిత రెడ్డిని పిలవకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పంచాయితీ కిషన్‌రెడ్డి వరకు చేరిందని తెలుస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నివేదిత రెడ్డి కి 2678 ఓట్లు వచ్చాయి. అప్పటి టీఆర్ఎస్ గాలిలో డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో భాగంగానే ప్రచారం కూడా మొదలు పెట్టారు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నివేదితా రెడ్డి. వీరితోపాటే మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది.
తెరపైకి కోటిరెడ్డి పేరు ..
2018లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన జానారెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కోటిరెడ్డి పేరుకూడా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని అనుకున్నానోములకు అవకాశం దక్కింది. కోటిరెడ్డికి మరోసారి అవకాశం ఇస్తామని అప్పట్లో పార్టీ ముఖ్యనేతల నుంచి హామీ వచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా టీఆర్ఎస్ సీటుపై క్లారిటీ వచ్చాకే కోటిరెడ్డి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నోముల కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో కోటిరెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగితే.. సాగర్‌లో జానారెడ్డి ఓటు బ్యాంకుకి కూడా గండికొట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ టిక్కెట్ విషయానికి వస్తే.. నోముల కుటుంబానికి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు, ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందనే అంశాన్ని బట్టి కోటిరెడ్డి నిర్ణయం ఉండనుంది. మొత్తం మీద దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తలేదు. కాని సాగర్‌లో బీజేపీకి అభ్యర్థుల ఎంపిక నుంచి పరీక్ష ఎదురుకానుందని చెప్పవచ్చు