తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి వినాయక చవితి రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రతి ఏడాది గణేశ్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయడం దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఆనవాయుతి. కానీ వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ ఏడాదికి ఉత్సవాలకు బ్రేక్ వేసింది. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ నాయకుల కోపానికి కారణమైంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ నిరసనలకు పిలుపు నిచ్చింది. వీహెచ్పీ పిలుపు ఇచ్చిన నిరసనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు.ఇచ్చింది. జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మంటపాలు తొలగించిన స్థలాల్లో నల్ల జెండాలతో నిరసన చేయాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేసి ఎట్టి పరిస్థితులలోనూ ఉత్సవాలు జరిపి తీరుతామని ప్రకటించారు.
తమకు భక్తే కావాలి…జనం చచ్చినా పర్వాలేదనే రీతిలో బీజేపీ తీరు ఉందనే చెప్పాలి. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోవిడ్ నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రకటనలు చేస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భక్తి కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమనే అంశాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు.