Fake Notice To Minister Gangula Kamalakar In The Name Of Enforcement Directorate :
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీగా మనం పిలుచుకునే కేంద్ర దర్యాప్తు సంస్థకే నకిలీ మకిలీ అంటించే యత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తీవ్రమైన ఆర్థిక నేరాల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని పేరున్న ఈ దర్యాప్తు సంస్థ పేరిట ఇప్పుడు ఓ నకిలీ నోటీసు జారీ అయ్యింది. అంతేకాకుండా విదేశాల నుంచి ఈడీ అధికారి పేరిట ఫోన్ లైన్ లోకి వచ్చిన ఓ సైబర్ నేరగాడు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ను టెన్షన్ పెట్టేశాడు. కమలాకర్ తో పాటు ఈడీ అధికారులు కూడా పోలీస్ స్టేషన్ కు పరుగెత్తేలా చేశాడు. వెరసి ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.
అసలేం జరిగింది?
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కీలక చర్చనీయాంశంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్ పై సీఎం కేసీఆర్ పెట్టారు. తాజాగా ఇప్పుడు హరీశ్ రావు కూడా ఈ బాధ్యతల్లోకి వచ్చినా.. అండర్ గ్రౌండ్ వర్క్ మొత్తం కమలాకరే చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మొన్నామధ్య కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులపై ఈడీ సోదాలు జరిగాయి. ఈ దాడులను ఆధారం చేసుకుని మంత్రి గంగుల కమలాకర్ ను భయపెట్టే వ్యూహానాకి ఓ సైబర్ నేరగాడు రంగంలోకి దిగాడు. ఈడీ సోదాల్లో మీ బండారం మొత్తం బయటపడింది.. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం.. అంటూ ఓ ఈడీ జారీ చేసినట్లుగా ఓ నోటీసు కమలాకర్ కు అందింది. అంతేకాకుండా కెనడా నెంబర్ నుంచి ఐవోఎస్ కాల్ చేసిన ఓ వ్యక్తి తనను తాను ఈడీ అధికారిగా చెప్పుకుని అరెస్ట్ చేయడానికి వస్తున్నామంటూ నేరుగా కమలాకర్ కే చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన గంగుల విషయాన్ని ఈడీ అధికారులకు తెలిపారు. వారి సూచన మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫోన్ చేసిన గంగుల.. మొత్తం విషయాన్ని వెల్లడించారు.
ఈడీతో పాటు గంగుల ఫిర్యాదు
ఈ వ్యవహారం వెలుగు చూసినంతనే.. గంగుల కంటే కూడా ఈడీ అధికారులే తొలుత షాక్ కు గురయ్యారట. తమ సంస్థ పేరిట నకిలీ నోటీసు రావడమేమిటి? అయినా తాము పంపినట్లుగా నేరుగా మంత్రికి నోటీసు ఎలా వెళ్లిందని ఆరా తీశారు. అయితే ఇలాంటి వ్యవహారాలపై ఎంతమాత్రం అజాగ్రత్తగా ఉండరాదన్న భావనతో వెనువెంటనే ఈడీ అధికారులు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఈడీ అధికారుల సూచన మేరకు గంగుల కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?