ప్రస్థానం మొదలెట్టిన నాడు కేవలం రెండంటే రెండు ఎంపీ సీట్లను కలిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఇప్పుడు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరడంలో ఎందరో నేతలు కీలక భూమిక పోషించారు. అలాంటి వారిలో తొలి వరుసలో నిలిచే వారిలో లాల్ కృష్ణ అద్వానీ ఒకరైతే.. ఆ తర్వాత స్థానంలో నిలిచే నేతగా కల్యాణ్ సింగ్ (89) పేరే వినిపిస్తుంది. అలాంటి కల్యాణ్ సింగ్ ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలం పాటు చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
రెండు సార్లు యూపీ సీఎంగా..
బీజేపీలో కరడుగట్టిన హిందూత్వ వాదులుగా పేరున్న వారిలో కల్యాణ్ సింగ్ పేరు కూడా ప్రధానంగానే వినిపిస్తుంది. అంతేకాకుండా బాబ్రీ మసీదుపై జరిగిన దాడి సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కల్యాణ్ సింగే ఉన్నారు. కల్యాణ్ సింగ్ ఆద్వర్యంలోని ప్రభుత్వం ఉన్న కారణంగానే అద్వానీ నేతృత్వంలోని కరసేవకులు బాబ్రీపై దాడి చేయగలిగారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ఇవేవీ పట్టించుకోని కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లో తనదైన శైలి పాలనతో ప్రజలను ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఆ తర్వాత మరోమారు యూపీ సీఎంగా పనిచేసిన కల్యాణ్ సింగ్.. వయసు మీద పడటంతో రాజకీయంగా ఇనాక్టివ్ గా మారారు. అయితే కల్యాణ్ సింగ్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన మోదీ సర్కారు.. ఆయనను రాజస్థాన్ గవర్నర్ గా నియమించింది. ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగిన కల్యాణ్ సింగ్.. అనారోగ్యం కారణంగా మరోమారు ఆ పదవిని చేపట్టలేకపోయారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక
వయోభారం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కల్యాణ్ సింగ్ లక్నో ఆసుపత్రిలో చేరారు. రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయిన కల్యాణ్ సింగ్..ఆరోగ్యపరంగా మరింతగా క్షీణించినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యం విషమించగా.. రాత్రి 10 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతి వార్త తెలియగానే బీజేపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. కల్యాణ్ సింగ్ మృతికి పార్టీ శ్రేణులు నివాళి అర్పిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలకు తెర తీశాయి. అదే సమయంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పలువురు నేతలు కల్యాణ్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు.