టీటీడీ రూల్స్ ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిలో వేరే మతానికి చెందిన వారు ఎవరైనా సరే కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దేవాదాయశాఖ చట్టం 30/1987ని బట్టి.. 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీఓను రిలీజ్ చేసింది. దీన్ని ఫాలో అవుతూ హిందువులు కాని వ్యక్తులు లేదా వేరే మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నాయని, అందుకే దర్శనానికి వచ్చాయని ధ్రువీకరణ చేయాలని. కాబట్టి, తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి, ప్రత్యేక ఫారంపై సంతకం చేయాలి.
వైఎస్ఆర్ సీపీ ఐదేళ్ల పాలనలో జగన్ చాలా సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. కానీ, క్రిస్టియన్ మతానికి చెందిన జగన్ సీఎం పదవిలో ఏనాడూ డిక్లరేషన్ చేయలేదు. అధికారులు ఎవరూ కూడా జగన్ ను డిక్లరేషన్ కోరలేదు. హిందూసంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు దీన్ని లేవనెత్తినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి ఛైర్మన్‌తోపాటు మంత్రులు పలువురు పరుష పదజాలంతో విపక్షాలపైనే విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.
అలా శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరు. ఒకవేళ డిక్లరేషన్ చేయకపోతే తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.
జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వాడిన విషయం ఇప్పుడు పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. అప్పటి టీటీడీ ఛైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో తాను సచ్ఛీలుడినని నిరూపించుకోవడం కోసం జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి రెడీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి, అక్కడినుంచి తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీంతో అన్యమతస్థుల వద్ద డిక్లరేషన్ తీసుకునే తరహాలోనే జగన్ వద్ద కూడా తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.











