ఎస్.. రాజకీయాలు వేరు. వ్యక్తులు వేరు. గోదాలోకి దిగినపుడు నువ్వెంతనంటే నువ్వెంత అనుకుంటారు.. కానీ ఓ కష్టం.. ఓ సంతోషం వచ్చినప్పుడు అంతా కలుస్తారు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ రోజు దాటితే ఆందరూ చుట్టాలే.. సరైన సందర్భం రావాలేగానీ ఆనాటి పగలు, ప్రతీకారాలు, ఆరోపణలు, వైషమ్యాలు మరచిపోతారు. మా ఇంటి సంబరానికి రావాలంటూ ఆత్మీయంగా ఆహ్వానించారు.. ఇటు వైపు పాత ప్రత్యర్థి కూడా అంతే ఆనందంగా సతీసమేతంగా బయల్దేరి తన ప్రత్యర్థిని ఆశీర్వదించారు. ఇదంతా సినిమా సీనులా ఉంది కాదూ… కాదండి. నిజమే. నిన్న మొన్నటి వరకూ కత్తులు నూరుకుని దుమ్మెత్తిపోసుకున్న రాజకీయ ప్రత్యర్థులు ఇలా ఓ ఫోటో ఫ్రేమ్‌లో ఇమిడిపోయారు.
ఏడాదిన్నర వెనక్కి వెళితే..
ఆయన ఓ అవినీతి తిమింగళం. జిల్లాను దోచేశాడు. రాష్ట్రాన్ని మింగేశాడు. మళ్లీ ఓటేస్తే ఇక ఆరాచకమే.. అంటూ కత్తి దూశాడు ఆ కుర్రాడు. జనంలో తిరిగారు, ప్రజల్లో నిలిచారు. అయినా సరే ఆ సీనియర్ ఎత్తుల ముందు నిలవలేకపోయారు, అంతే.. ఆ సీను అక్కడితో ముగిసింది. కట్ చేస్తే ఆ గెలిచిన పెద్దాయన మంత్రి అయ్యారు. మళ్లీ సభలు, సమావేశాలు , రాజకీయ ఆరోపణలు – వీటితో బిజీ అయ్యారు. అనుకోకుండా తన ప్రత్యర్థి నుంచి ఫోన్.. ఇంకెవరూ..? తనతో ఎన్నికల్లో తలపడిన కుర్రాడే ఫోన్ చేశారు. పెద్దాయనా… నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి.. ఆశీర్వదించాలి అన్నారు. ఇటు ఈయనా .. సరే బాబూ అన్నారు. అన్నేసి మాటలు అనేసిన నోటితో మళ్ళీ ఎలా పిలవాలి అని ఆ కుర్రాడూ అనుకోలేదు. అప్పట్లో నన్నుఅన్నేసి మాటలన్నారు. విమర్శించారు, ఆయన పెళ్లికి నేను పోవడమా? అని ఈయనా అనుకోలేదు. రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ఆ పెద్దాయన ఆ కుర్రాడి పెళ్లిరోజుకు తన పనులన్నీ వాయిదా వేసుకుని మరీ తన భార్యతో కలిసి వెళ్లారు. నవ దంపతులకు కొత్త బట్టలు పెట్టి నిండు మనస్సుతో ఆశీర్వదించారు.
అందరిలో ఆశ్చర్యం
మండపంలో ఈ దృశ్యం చూసినవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన రాజకీయ ప్రత్యర్థి పెళ్లికి ఇలా సతీసమేతంగా వచ్చి బట్టలు పెట్టి మరీ ఆశీర్వదించడం నిజంగా ఊహకు అందనిది. కానీ ఆయన అంతే. గౌరవంతో పిలిచిన పిల్లగాడి పెళ్లికి సంతోషంగా బయల్దేరి ఆశీర్వదించి అందర్నీ పలకరించి వచ్చారు. రాజకీయాలు రాజకీయాలే.. వాటిని జీవితాంతం అంటిపెట్టుకుని ఉండకూడదు అని చెప్పకనే చెప్పిన దృశ్యం.. ఓ సందర్భం ఇది.
ఇంతకూ ఆ పెళ్లికొడుకు ఎవరనుకున్నారు? కిమిడి నాగార్జున. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి సత్తిబాబు మీద పోటీ చేసి ఓడిపోయారు. అదిగో అదే ఈ ఫాటో… ఫోటోలో సత్తిబాబు సతీమణి ఝాన్సీ కూడా ఉన్నారు.