బొత్స సత్యనారాయణ..వైసీపీ కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు. ఇటీవలి ఎన్నికల్లో కూటమి హవా కారణంగా ఉత్తరాంధ్రలో పెద్ద నాయకుడిగా ఉన్న బొత్స సైతం ఘోరంగా ఓడిపోయారు. ఐతే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ చట్టసభల్లో అడుగుపెట్టారు. కానీ పార్టీ ఘోర పరాజయం తర్వాత బొత్స అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడడం తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనపడడం లేదు.
ఐతే తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఆయన వైసీపీలో నంబర్ 2,3 అంటూ మీడియా వార్తలు రాస్తుందన్నారు. ఆయన వెళ్లిపోవాలనుకున్నారు, వెళ్లిపోయారంటూ కామెంట్ చేశారు బొత్స. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి చర్చించాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు బొత్స. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి పదవి బొత్సకు ఇస్తారన్న ప్రచారంపై విలేఖరులు ప్రశ్నించగా..అదేమైనా బంగారమా అంటూ బొత్స బదులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో పాటు కంచుకోట లాంటి చీపురుపల్లిలో తాను ఓడిపోవడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ హైకమాండ్ తీరు వల్లే తను ఓటమి పాలయ్యానన్న భావనలో బొత్స ఉన్నారని సమాచారం. పార్టీ పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది. ఐతే వైసీపీ ఓటమి తర్వాత బొత్స జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆ సమయంలో ఆ ప్రచారాన్ని కొట్టిపారేసినప్పటికీ..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక వైసీపీ 2019 ఎన్నికల్లో గెలిచి బొత్స మంత్రిగా పని చేసినప్పటికీ..ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనమే నడిచింది. బొత్సను కేవలం విజయనగరానికే పరిమితం చేశారు వైసీపీ పెద్దలు. ఇప్పుడు కూడా బొత్స గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయనకు ఆ పదవిపై అంతా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి పదవి బొత్సకు ఇవ్వాలని క్యాడర్ పట్టుబడుతున్న జగన్ తన బాబాయి సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.