మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి..ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి షర్మిలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా..వైసీపీలో కలకలం రేపుతోంది. ఇటీవల మూడేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి..మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల షర్మిలతో పాటు రాజకీయ అంశాలు చర్చించారని సమాచారం. మధ్యాహ్నం షర్మిల ఇంట్లోనే విజయసాయిరెడ్డి భోజనం చేశారని సన్నిహితులు చెప్తున్నారు.
మూడేళ్ల క్రితమే జగన్, షర్మిల మధ్య రాజకీయ, కుటుంబ విబేధాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి షర్మిలను కలవడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో షర్మిల జగన్‌ను విబేధించినప్పుడు విజయసాయి ఆమెపై ఘాటు విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్‌పైనా షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబును షర్మిల కలిసిన టైంలోనూ పసుపు రంగు చీర కట్టుకున్నారంటూ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయంగా షర్మిలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఆమెతో దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి వెళ్లారని అంటున్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన టైంలో షర్మిల స్పందించారు. వివేకానందరెడ్డి హత్య వెనుక ఏం జరిగిందనే విషయాలను విజయసాయి ఇప్పటికైనా బయటపెట్టాలని షర్మిల సూచించారు. విజయసాయి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని కామెంట్ చేశారు షర్మిల.ఈ నేపథ్యంలో విజయసాయి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేకానంద రెడ్డి కేసులో విజయసాయిరెడ్డి షర్మిలకు సాయం చేయాలని డిసైడైతే… జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వారం రోజుల క్రితం వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి..భవిష్యత్‌లో వ్యవసాయంపై దృష్టిపెడతానని ప్రకటించారు. ఇక రెండు రోజుల క్రితం వైసీపీకి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం విజయసాయి రాజీనామా చేశారు. ఈ లేఖను పార్టీ చీఫ్ జగన్‌కు పంపారు.