టాలీవుడ్ లో సినీ కార్మికులు సమ్మె సైరన్ మోగించిన సంగతి తెలిసిందే. కరోనాతో కష్టాల్లో పడిన కార్మికులు పరిస్థితులు కుదుటపడిన తర్వాత వేతనాలు సవరించాలని ఇప్పటికే నిర్మాతల మండలికి నివేదించిన కార్మిక సంఘాలు..మండలి తమ ప్రతిపాదనను పరిశీలించకపోవడంతో సినిమా నిర్మాణరంగానికి చెందిన 24 క్రాప్ట్ సభ్యులు సమ్మెకు పూనుకున్నారు. వేతన సవరణ జరిగేదాకా విధుల్లో పాల్గొనబోమని కార్మికులు సమ్మెబాట పట్టి స్పష్టం చేశారు. దీంతో తెలుగు సినిమాలతో పాటు హైదరాబాద్‌లోనూ, పరిసరాల్లోనూ జరిగే సినిమా పరభాషా చిత్రాల షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కాగా, సినీ కార్మికులు సమ్మె పై నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. కార్మికుల వేతనాలు పెంచడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని.. అయితే ఉన్నపళంగా సమ్మెకు దిగడం మంచిది కాదని ఆయన అన్నారు. తాము షూటింగులు ఆపడానికి సిద్ధంగా లేమని.. నిర్మాతలమంతా చర్చలు జరిపాక వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే సినీ కార్మికులు మాత్రం తమ డిమాండ్ లను పరిష్కారంచే వరకు సమ్మె విరమించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడా తెలుగు చిత్రాల షూటింగులు జరగవని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ కల్పించుకుని తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే సినీ కార్మికుల సమ్మె పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వివరించారు. తక్షణమే సినీ కార్మిక సంఘాలతో ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తలసాని సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచిచూడొద్దని హితవు పలికారు. సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.