నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు రోజుల ఈడీ విచారణ నిన్నటితో ముగిసింది. ఆఖరి రోజైన ఐదో రోజున ఈడీ అధికారులు సుమారు 15 గంటల పాటు రాహుల్ ను విచారించారు. ఈ విచారణలో రాహుల్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం తనకు ఎదురైన అనుభవాలను ఉద్దేశించి పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి..
చివరి రోజు విచారణ తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈడీ విచారణకు సంబంధించి కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. “తాము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు కదా.. ఇంతటి సహనం మీకు ఎలా వచ్చింది?” అని ఈడీ అధికారులు తనను అడిగినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. దానికి ప్రతిగా రాహుల్ తాను 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని… కాంగ్రెస్ పార్టీలో ఉంటే సహనం దానికదే అలవడుతుందని.. కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు సహనాన్ని నేర్పుతుంది అని తాను సమాధానం చెప్పినట్లు ఆయన చెప్పుచొచ్చారు. కాగా , ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..దీంతో రాహుల్ గాంధీపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.
రాహుల్ వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. ఒకదాని తర్వాత మరొకటి వరుసబెట్టి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది… అయినా సహనంతో ఉంటున్న మీరు కాంగ్రెస్ ముక్త్ భారత్ చూస్తారు అని ఒకరు.. రాహుల్ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో చెప్పిన మాటలు అక్షరాల సత్యమంటూ మరోకరు కామెంట్ చేయగా.. మేమడిగిన ప్రశ్నలన్నింటికీ తప్పుడు సమాధానాలు ఇచ్చేంత సహనం మీకెక్కడిది అని ఈడీ అధికారులు అడిగి ఉంటారంటూ.. మరో నెటిజన్ చాలా ఘాటు కామెంట్ చేశారు.