జగన్ సర్కార్ పై ఏపీ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులు ఉపసంహరించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇష్టానుసారం కేసులు ఉపసంహరించుకోవడం కోర్టు ధిక్కరణ అవుతుందన్న న్యాయస్థానం, సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రాహతరంలో ఎంపీ, ఎమ్మెల్యే లపై ఉపసంహరణకు పెండింగ్ లో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది.ఇప్పటి వరకు ఉపసంహరించుకున్న కేసుల వివరాలు , వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు అనే అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కృష్ణ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటూ జగన్ సర్కార్ 2021లో జీవో విడుదల చేసింది.ఉదయభాను పై మొత్తం పది కేసుల ఉండగా వాటన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. కాగా కేసులు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ అంశంపై హైకోర్టు చేపట్టింది. ఈ సందర్భంగా ఉదయభాను పై ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసు, అధికారులపై దాడులు చేసిన కేసులు ఉండగా, వాటన్నింటినీ కూడా తొలగించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, కేసులు తొలగిస్తూ కలెక్టర్, డిజిపి ఉత్తర్వులు ఇవ్వడం పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు వారు ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది.అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను, హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేసమయంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు ఉపసంహరించుకోవాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు.
వాదనలు విన్న ధర్మాసనం కేసుల ఉపసంహరణకు హైకోర్టు అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. తీసుకోలేదని న్యాయవాది చెప్పడంతో , అనుమతి తీసుకోకుండా కేసులు తొలగించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అదేసమయంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఎన్ని తొలగించారు, ఎన్ని కేసుల్లో ఉపసమహారణకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు అనే అంశాలను వివరిస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో తమ ముందున్న ప్రజాప్రతినిధుల ఉపసంహరణ కేసులో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.