దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తొలినాళ్లలో తీసిన సై సినిమా గుర్తుంది కదా. అందులో ప్రతి నాయకుడు ఓ కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆ స్థల యజమాని కుటుంబం మొత్తాన్ని కట్టిపడేసి… కుటుంబ సభ్యుల ముందే యజమానికి చంపి స్థలం పత్రాలపై సంతకాలు తీసుకుంటాడు. ఆపై ఆ స్థలంలోని కళాశాలను ఖాళీ చేయాలంటూ ఏకంగా కోర్టు నుంచే నోటీసులు జారీ అయ్యేలా చేస్తాడు. అచ్చు గుద్దినట్టు…ఈ సినిమా మాదిరిగానే కాకినాడ సీ పోర్టును అరబిందో ఫార్మాకు చెందిన అనుబంధ కంపెనీ అరబిందో రియాల్టీ కబ్జా చేసింది. నిజమా?… అంటే సాక్షాత్తు ఏపీ మంత్రి హోదాలో ఉన్న నాదెండ్ల మనోహర్ నోటి నుంచే దీనికి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు వెలువడిన తర్వాత కూడా నిజమని నమ్మక తప్పదు కదా.
కేవీ రావు నుంచి కాకినాడ సీ పోర్టును అరబిందో రియాల్టీ బలవంతంగా లాక్కుందని నాదెండ్ల ఆరోపించారు. ఇలా అరబిందో రియాల్టీ లాక్కున్న కాకినాడ సీ పోర్టు నుంచే ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమంగా దేశం దాటి తరలిపోతోంది. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని ఇలా అక్రమంగా దేశం దాటించి తమ జేబులు నింపుకునే ప్రణాళికల్లో భాగంగానే గత పాలకులు ఏకంగా సీ పోర్టును తమ వారికి దక్కేలా చేశారన్న ఆరోపణలూ లేకపోలేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులకు బినామీగా పేరున్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా నగరంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా చక్రాన్ని తిప్పారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని ఆయనపై చాలా కాలం నుంచే ఆరోపణలు ఉన్నాయి. ఇక పీవీ రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని అరబిందో ఫార్మాకూ జగన్ అక్రమాస్తుల కేసుల్లో పాత్ర ఉంది. జగన్ కంపెనీల్లోకి అక్రమ మార్గాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా అరబిందో ఫార్మాపై సీబీఐతో పాటు ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరబిందో కంపెనీకి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చిన కారణంగానే ఆ కంపెనీ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులో నాడు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న నిత్యానందరెడ్డితో పాటుగా కంపెనీ సెక్రటరీగా ఉన్న చంద్రమౌళిలను ఆ సంస్థలు నిందితులుగా పేర్కొంటూ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఇప్పుడు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్చ ఊపందుకోగానే… జగన్ తో పాటు అటు ద్వారంపూడి, ఇటు అరబిందో పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. అందులో భాగంగానే కాకినాడ సీ పోర్టును అరబిందో ఎలా లాక్కుందన్న అంశం కూడా చర్చకు వచ్చేసింది.
అరబిందో ఫార్మా ఓ ఔషధ తయారీ కంపెనీ. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేదాకా ఈ కంపెనీ పెద్దగా విస్తరణ దిశగా అడుగులు వేయలేదనే చెప్పాలి. రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కంపెనీ బారీ ఎత్తున విస్తరణ ప్రణాళికలను అమలు చేసింది. అప్పటిదాకా ఫార్మా రంగం మినహా ఇతర రంగాల జోలికి వెళ్లని అరబిందో ఆ తర్వాత చాలా రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగానే అరబిందో రియాల్టీ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ కాకినాడ సీ పోర్టు చేజిక్కించుకునేందుకు ఆసక్తి చూపింది. ఇందుకు గత వైసీపీ సర్కారు నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించగా… నాడు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి అన్నీ తానై ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నాడు కాకినాడ సీ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావును అరబిందో ఫార్మా సంప్రదించగా… పోర్టును వదులుకునేందుకు ఆయన అంతగా ఆసక్తి కనబరచలేదు. ఈ క్రమంలో ద్వారంపూడి స్వయంగా రంగంలోకి దిగి కేవీ రావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారట. అంతేకాకుండా కేవీ రావుకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయట. ఓ వైపు నుంచి స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి, మరో వైపు నుంచి బెదిరింపులు, సర్కారు నుంచి ఎలాంటి భరోసా దక్కని పరిస్థితుల నేపథ్యంలో కేవీ రావు తప్పనిసరి పరిస్థితుల్లో సీ పోర్టులో అరబిందోకు 41 శాతం వాటాలు విక్రయించక తప్పలేదట.
ఎప్పుడైతే కాకినాడ సీ పోర్టు అరబిందో వశం అయ్యిందో… అప్పటి నుంచే ద్వారంపూడి చక్రం తిప్పడం మొదలుపెట్టారని చెప్పాలి. రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో పోగేయడంతో పాటుగా సదరు బియ్యాన్ని సీ పోర్టు ద్వారానే బహిరంగంగా ఆయన విదేశాలకు తరలించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గతంలోనే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో బయటపెట్టారు. బియ్యాన్ని అక్రమంగా దేశం దాటిస్తున్న ఘనాపాఠి ద్వారంపూడి అని పవన్ సంచలన ఆరోపణలు కూడా గుప్పించారు. ఇలా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన బియ్యం అక్రమ రవాణా గురించిన చర్చలోకి కాస్తంత లోతుగా వెళితే… ఈ వరుస పరిణామాలన్నీఇట్లే గుర్తుకు వస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… విశాఖలో ఖరీదైన స్థలాలు, కంపెనీలను ఆ పార్టీకి చెందిన నేతలు ఎలా హస్తగతం చేసుకున్నారన్న విషయాలు కథలుకథలుగా వినిపించేవి. అదే మాదిరిగా కాకినాడలోనూ ద్వారంపూడితో .పాటు జగన్ అనుచర గణం తమదైన శైలిలో స్వైర విహారం చేశాయని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. తమది కాని పోర్టును హస్తగతం చేసుకోవడంతో పాటుగా దాని ద్వారా పేదల బియ్యాన్ని దేశం దాటిస్తున్న వైనంపై జనం కోరుతున్నట్లుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరిగి తీరాల్సిందే. అదే జరిగితే ఇంకెన్ని కఠోర వాస్తవాలు వెలుగు చూస్తాయో?