అతడో చిరు ఉద్యోగి. శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో సారవకోట మండలం బుడితి గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న సదరు ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేయగా… ఏకంగా రూ.3 కోట్ల విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయి. ఈ విలువ సోదాల్లో లభ్యమైన పత్రాల ఆధారంగా లెక్కించినదే. అదే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ ఏకంగా రూ.30 కోట్ల పైమాటేనని స్వయంగా ఏసీబీ అధికారులే చెబుతున్నారు. సర్కారీ వైద్యశాల..అది కూడా గ్రామ స్థాయి ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరుద్యోగి ఈ మేర ఎలా సంపాదించాడంటారా? వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వద్ద పన్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా పనిచేస్తే ఇలా సంపాదించడం సాధ్యమే మరి. వినడానికి కాస్తంత ఎబ్బెట్టుగా ఉన్నా… ఏసీబీ రెయిడ్ జరిగిన చిరుద్యోగి గొండు మురళి వ్యవహారాన్ని చూస్తే మాత్రం ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు.
2019లో వైసీపీ అదికారంలోకి రాగానే..,. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఆ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధర్మాన కృష్ణదాస్ కు జాక్ పాట్ తగిలింది. జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదాలో మంత్రి పదవిని దక్కించుకున్న కృష్ణదాస్… కీలకమైన రెవెన్యూ శాఖ పగ్గాలను అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన వద్ద పీఏగా గొండు మురళి చేరారు. కృష్ణదాస్ దాదాపుగా రెండున్నరేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగగా… మురళి కూడా వేరే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా,…ఆ రెండున్నరేళ్ల పాటు తానే కృష్ణదాస్ కు పీఏగా కొనసాగారు. ఈ సమయంలో ధర్మాన వ్యవహారం ఎలా సాగిందో తెలియదు గానీ… మురళి మాత్రం జిల్లాలో తనదైన హవాను నడిపారు. తన మాతృశాఖ అయిన వైద్య, ఆరోగ్య శాఖలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బదిలీలన్నీ మురళి కనుసన్నల్లోనే జరిగాయట. అక్కడితో ఆగని మురళి… జిల్లాలోని ఇతర శాఖల వ్యవహారాల్లోనూ కాళ్లూ, వేళ్లూ పెట్టారట. మొత్తంగా మంత్రిగా పీఏ హోదాలో మురళి శ్రీకాకుళం జిల్లాలో రెండున్నరేళ్ల పాటు తనదైన రాజ్యాన్ని నడిపించారని విమర్శలు ఉన్నాయి.
వైసీపీ అదికారంలో ఉన్నంత కాలం మురళి వ్యవహారాలపై నోరు విప్పేందుకు జంకిన ఉద్యోగులు.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఒకింత ధైర్యం చేశారు. వైసీపీ జమానాలో మురళి సాగించిన అకృత్యాలపై శ్రీకాకుళం ఉద్యోగులు వరుసబెట్టి ఏసీబీకి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు మురళిపై దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విశాఖ జిల్లాలోనూ మురళి పలు ఆస్తులు కూడబెట్టిన వైనాన్ని గుర్తించిన ఏసీబీ… రెండు జిల్లాల్లోనూ సోదాలు చేసింది. ఈ సోదాల్లో డబ్బుల కట్టలు, బంగారపు గుట్టలు లభ్యమయ్యాయి. మొన్నామధ్య వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, భీమవరం అక్వా వ్యాపారి గ్రంధి శ్రీనివాస్,ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలో బయటపడ్డట్టుగానే మురళి ఇంటిలో కూడా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు బయటపడటం గమనార్హం.