పూజా హెగ్డే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్. అలా అని ఆమె మనకు మాత్రమే టాప్ అనుకుంటే పొరపాటు. హిందీలో కూడా ఆమె టాప్ దిశగా దూసుకుపోతోంది. తమిళ్ లో కూడా టాప్ హీరో సరసన నటిస్తోంది. ఇలా ఒకేసారి 3 భాషల్లో సినిమాలు చేస్తూ, 3 పడవల ప్రయాణం సాగిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమెకు జిమ్ చేయడానికి కూడా టైమ్ సరిపోవడం లేదంట.
లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా బిజీ అయిపోయింది పూజా హెగ్డే. అప్పటికే కమిట్ అయిన సినిమాలకు వరుసపెట్టి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసింది. అలా కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిలో పడిపోయింది పూజా హెగ్డే. ప్రభాస్ హీరోగా వస్తున్న “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ గురించి చెప్పడానికి, ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. తిరిగి వర్క్ ప్రారంభించే సమయం ఆసన్నమైందంటూ ఓ కొటేషన్ కూడా జోడించింది. రాధేశ్యామ్ సెట్స్ కు తిరిగి రావడానికి ఆమె హైదరాబాద్ వచ్చింది.
హైదరాబాద్ వచ్చిన పూజా హెగ్డే కేవలం రాధేశ్యామ్ సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు. ఓవైపు ప్రభాస్ తో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే, సాయంత్రానికి డాన్స్ స్టుడియోలో వాలిపోతోంది. కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో డాన్స్ నేర్చుకుంటోంది. దీనికి ఓ కారణం ఉంది. త్వరలోనే విజయ్ సరసన బీస్ట్ అనే సినిమా చేయబోతోంది పూజా హెగ్డే. ఓ పాటతో ఈ సినిమా షూట్ మొదలవుతుంది. అందుకే ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే డాన్స్ నేర్చుకుంటోంది. ఆమెకు డాన్స్ మూమెంట్స్ నేర్పించేందుకు, చెన్నై నుంచి హైదరాబాద్ కు ఓ కొరియోగ్రాఫర్ ప్రత్యేకంగా వచ్చాడు. అలా హైదరాబాద్ లోనే రెండు సినిమాల పనుల్ని చక్కబెట్టేస్తోంది పూజా హెగ్డే.
ఈ రెండు సినిమాల పనులు పూర్తయిన వెంటనే ముంబయి వెళ్లబోతోంది పూజా హెగ్డే. రణ్వీర్ సింగ్ తో కలిసిస సిర్కస్ సినిమా చేయబోతోంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ రాబోతోంది. రామ్ చరణ్ తో కలిసి ఆచార్య కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతోంది. ఇవి కాకుండా సల్మాన్ ఖాన్ సినిమా, అఖిల్ సినిమా కూడా పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి. ఇలా పోస్ట్-లాక్ డౌన్ లో బిజీబిజీగా గడిపేస్తోంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ఈమె కొత్తగా మరో సినిమాకు కాల్షీట్ కేటాయించే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ పూజా హెగ్డే ఫలానా హీరో సరసన నటించబోతోందంటూ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి స్టోరీలు చూసి నవ్వడం తప్ప ఏమీ చేయలేనంటూ ప్రకటించింది పూజా హెగ్డే.