దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 2 లక్షల కేసులు దాటిపోయాయి. గత ఏడాది కోవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పుడు ఇదే సమయంలో రోజుకు లక్షా 45 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. నేడు కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా రోజుకు 1100 దాటిపోయాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కనీసం రోగులకు బెడ్లు కూడా దొరకడం లేదు. ఢిల్లీలో రోగులకు బెడ్లు దొరక్క ఒక్క మంచాన్ని ఇద్దరికి కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారం రోగుల పాలిట శాపంగా మారింది.
మహా కల్లోలం
మహారాష్ట్రలో రోజుకు 60 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది జనతా లాక్ డౌన్ తరహాలో 15 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్ప ఎలాంటి వ్యాపారాలు అనుమతించడం లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసరం అయిన వారికి పాసులు మంజూరు చేస్తున్నారు. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్‌లు, పార్కులు, వాప్యార సముదాయాలు అన్నీ మూసివేశారు. వైద్యసేవలు, నిత్యావసరాల వాహనాలను మాత్రమే రోడ్లపై అనుమతిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్ వేవ్‌లో మరణాలు కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ మొదటి వేవ్‌లో 97 శాతం రికవరీ ఉండగా, సెకండ్ వేవ్‌లో కేవలం 94 శాతం మాత్రమే రికవరీ రేటు నమోదవుతోంది. దీంతో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఆసుపత్రుల్లో బెడ్లులేవు, స్మశానాలు ఖాళీలేవు
కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందనేందుకు ఆసుపత్రులు, స్పశానాలు ప్రత్యక్ష సాక్షీ భూతాలుగా నిలుస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకడం లేదు. చాలా ఆసుపత్రుల్లో ఇద్దరికి కలపి ఒక బెడ్ కేటాయిస్తున్నారు. దీంతో కరోనా మరింత వేగం పుంజుకుంది. ఢిల్లీ, గుజరాత్ లోని గాంధీనగర్, అహ్మదాబాద్ స్మశాన వాటినకల వద్ద కరోనా మృతులతో కూడిన అంబులెన్సులు బారులు తీరాయి. కరోనా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్మశానాల వద్ద రద్దీ చూస్తే అర్థం అవుతోంది. నాలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో కూలీలు వలస బాట పట్టారు. ఇది పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర నుంచి కూలీలు పెద్ద ఎత్తున తరలివెళ్లిపోతున్నారు. వారి ద్వారా ఇప్పటికే తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ నుంచి లక్షలాది కూలీలు ఇప్పటికే వలస వెళ్లిపోయారు. కూలీల వలసలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది.
తెలంగాణ, ఏపీలో కరోనా కట్టడికి చర్యలు
తెలంగాణలో కరోనా లెక్క తప్పింది. అధికారులు చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నిన్న ఒక్క రోజే 400 కేసులు నమోదయ్యాయని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కేవలం హైదరాబాద్‌లోని మలక్ పేట, సరూర్ నగర్, హయత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోజుకు 400 కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అధికారులు చెప్పే కరోనా లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఇక నిజామాబాద్‌లో 1200 టెస్టులు చేయగా వారిలో 300 మంది కరోనా బారినపడ్డట్టు నిర్ధరణ అయింది. అంటే టెస్టులకు వస్తున్న వారిలో 20 శాతం మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం అసలు గణాంకాలు దాస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరణాల సంఖ్యపై కూడా ప్రభుత్వ గణాంకాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం
ఏపీలో నిన్న ఒక్క రోజే 4200 కరోనా కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే అనేక కరోనా కేంద్రాలను మూసివేశారు. కరోనా మొదటి వేవ్‌లో పనిచేసిన కాంట్రాక్టు వైద్య సిబ్బందికి నేటికీ జీతాలు ఇవ్వకపోవడంతో, సెకండ్ వేవ్‌లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం కరోనా టెస్టు శాంపిల్స్ తీసేందుకు కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ రోగుల వద్ద నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పిండుతున్నారు. కరోనా గుర్తించిన 3 గంటల్లో బెడ్లు కేటాయించాలని సీఎం ఆదేశించినా క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
అందని టీకాలు..
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోన్నా కరోనా టీకాలు మాత్రం రాష్ట్రాలకు చేరడం లేదు. డిమాండ్‌లో సగం కూడా కరోనా టీకాలు అందడం లేదు. కరోనా టీకాలు లేకుండానే కరోనా టీకా ఉత్సవాలు ముగించారు. ఒక రోజు టీకా అందుబాటులో ఉంటే మూడు రోజులు టీకాలు వేయడం లేదు. కరోనా టీకా తయారీ కంపెనీలకు ముడిసరకు కొరత కూడా వేదిస్తోంది. దీంతో విదేశాల నుంచి టీకాలు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ మరికొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. విదేశాల్లో కరోనా టీకా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇప్పుడు ఆర్డరు పెడితే మూడు నెలల తరవాత మాత్రమే టీకా మందు డెలివరీ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అంటే విదేశీ కరోనా టీకాలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.