‘యాడైన బావ గాని వంగతోట బావకాదు’ అనే నానుడు అధికార వైసీపీ నాయకుల విషయంలో నూటికి నూరుపాళ్లు రుజువుతోంది. అధికారం తమ పార్టీ చేతులలో ఉండటంతో వైసీపీ నాయకులు హవా ఏపీలో ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. అధికారం నెత్తినెక్కడంతో ప్రక్క రాష్ట్రాలలో కూడా తమ హవా సాగుతోందని భ్రమలో ఉన్న వైసీపీ నాయకులు చెల్లని నాణేలుగా మిగులుతున్నారు. ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలంటే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు వ్యవహారం, బాలినేని శ్రీనివాసరెడ్డి నోట్ల కట్టల ఉదంతం, తాజాగా పలమనేరు వైసీపీ నేత ఘనకార్యాలను చెప్పుకోవచ్చు.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2004లో రాష్ట్ర విప్ గా పని చేసిన సామినేని ఉదయభాను ఆ తరువాత వరుసగా 2009,2014 ఎన్నికలలో పరాజయం పాలైయ్యారు. 2019లో జగన్ హవాలో గెలిచిన ఆయన దాదాపు 10 సంవత్సరాల తరువాత అధికారాన్ని అందుకున్నారు. అధికారంలో ఉన్నామనే భావనతో ఆయన తనయుడు హైదరాబాద్ లో పోలీస్ విధులను ఆటంకం కలిగించడమే గాకుండా దూషించాడు. ఇది ఏపీలో అయితే చెల్లదేమో గాని తెలంగాణ రాష్ట్రంలో చెల్లలేదు. అతడిని పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేశారు. ఈ సంగతి మరచిపోకముందే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన నగదుగా ఆరోపణల వస్తున్న 4.5 కోట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు తమది కాదని ఆ తరువాత బాలినేని మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ నగదు కేసుపై ఈడీ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో అసలు విషయాలు బయటికి రానున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఒడిస్సా రాష్టంలో వెలుగులోకి వచ్చింది.పలమనేరు వైసిపి నేతకు చెందిన కంటైనర్ ను అక్కడి పోలీసులు సీజ్ చేశారు. ఆ కంటైనర్ లో 20 టన్నుల పశు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిస్సా రాష్ట్రంలో పశు మాంసం అక్రమ రవాణాపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. చట్టం తన చుట్టమనే భ్రమలో ఉన్న వైసీపీ నేత షేక్ జాఫర్ తాను ఒడిస్సాలో ఉన్నట్లు మరిచిపోయాడు. ఒడిస్సా పోలీసులు లారీని సీజ్ చేసి, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన కంటైనర్ పలమనేరు వైసీపీకి చెందిన ఎస్ కే ఎస్ ట్రాన్స్ పోర్ట్ అధినేతదిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మన వైసీపీ నాయకులు ప్రక్క రాష్ట్రాలలో చెల్లని నాణేలనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.











