మూడు రాజధానులు… ఇదీ ఆంద్ర ప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఒక రాజధానికి శంకుస్థాపన జరిగాక ప్రభుత్వం మారడంతో ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఈ కొత్త ప్రతిపాదనల అమలు మాట ఎలా ఉన్నా అసలు రాజధాని నగరానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? రాజధాని అభివృద్ధి జరగాలంటే నగర విస్తరణ జరగాలా? కొత్త నగర నిర్మాణం జరగాలా ? అనే అంశాలను విశ్లేషించే ప్రయత్నమిది. రెండు నగరాలను ఏకం చేస్తూ తీసుకున్న నిర్ణయం అమరావతి నగర నిర్మాణం. కొత్త పరిపాలన రాజధానిగా విశాఖపట్నం విషయంలోనూ కొత్త సందేహాలు ఉన్నాయి. ఈ పరిపాలన రాజధానికి అనుబంధంగా విశాఖపట్నం విస్తరించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయంలో నీటి వనరులు కీలకపాత్ర పోషిస్తుంటాయి.
నదులు లేకుండా నాగరికత విస్తరించలేదన్నది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. నగర విస్తరణకు కూడా నీటివనరులు అందుబాటులో ఉండాలి. నదుల లేకుండా నగరాల నిర్మాణం సాధ్యం కాదు కాలేదు కూడా. నదుల పక్కనుంచే మన నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. నాగరికత అన్నది దేశాలకే కాదు రాష్ట్రాల అభివృద్థికి కూడా సాధనమేనని చెప్పాలి.
చరిత్రలోకి వెళితే…
మనకు నాగరికత పేరు ఎత్తగానే సింధు నాగరికత గుర్తొస్తుంది.“ సింధులో వెలసినా ఓ నాటి స్వప్నమా… నా వారి ఘనతను నినదించు నాదమా .. చరణాలు తెగినట్టి పాటలా రాలావే… ఈ నేల పొరలలో చరితవై మిగిలావే…హే దివ్య సింధు విశ్వజన బంధు నీ కీర్తి కౌముదులు పర్వుదిశలందు… అంటూ మనం చిన్నపుడు చదువుకున్న పాటలే గర్తుకు వస్తాయి. సింధూ నదే హరప్పా నాగరికతకు కేంద్రస్థానమైంది కూడా. హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. మొహంజొదారో, చన్హుదారో, బన్వాలీ, లోథాల్.. ఆనాటి ప్రసిద్ధ నగరాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు పెద్ద నగరాలుగా విస్తరించిన వాటి వెనుక కూడా నదులు ఉన్నాయనే విషయాన్ని మరువకూడదు.
నగరం అనేది ముఖ్యంగా తాగు నీటి అవసరాలతో కూడుకుని ఉన్నది. ఉదాహరణకు మన హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే గోదావరి, కృష్ణా నదులు ఈ నగరవాసుల తాగునీటి అవసరాల్ని తీరుస్తున్నాయి. గోదావరి ఉపనది మంజీర నీరు హైదరాబాద్ కు వరప్రసాదమని చెప్పాలి. అయినా తాగునీటి అవసరాలు తీరకపోవడంతో కృష్ణా నీటిని కూడా హైదారాబాద్ కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పటికీ వేసవిలో కొన్ని ప్రాంతాల్లో తాగునీరు లభించడం కష్టంగా ఉంటోంది. ప్రసుత్తం గోదావరి, కృష్నా నీళ్లను చాలా దూరం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయినా అవి ఏడాది పొడవునా నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతోుంది. ఈ ప్రాజెక్టు నీటిలో పదిశాతం నీటిని మంచినీళ్లకు వాడుకునే ఏర్పాటుచేయనున్నారు.
అమరావతి విషయానికి వస్తే….
అమరావతిని రాజధాని నగరంగా ఎంపిక చేసినప్పుడే కృష్ణా నదిని దృష్టిలో ఉంచుకుని చేసినట్లుంది. పైగా గోదావరి నీరు కృష్ణలో కలిసే ఏర్పాటుకూడా అక్కడే ఉంది. మరో పక్క సమీపంలోనే పులిచింతల ప్రాజెక్టు ఉండనే ఉంది. కాబట్టి అమరావతి నగర నిర్మాణం జరిగి ఉంటే తాగునీటి సమస్య ఏర్పడే అవకాశమే లేదు. రాజధాని అభివృద్ధి జరగాలంటే ముందు ఒక మహానగరం అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధిచెందటానికి నీటి వనరులు తోడవ్వాలి. అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగైతేనే నగరం అభివృద్ధి చెందుతుంది. ఆర్ఘికంగానూ, భౌగోళికంగా, మార్కెట్ పరంగానూ సంబంధబాంధవ్యాలు ఆ నగరానికి ఏర్పడతాయి. ఈ మహానగర నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కనుచూపు మేరలో అమరావతి నగర నిర్మాణం సాధ్యమయ్యేలా లేదు. అక్కడ నిర్మించిన భవనాలను సైతం అమ్మకానికి పెట్టాలనుకోవడం వల్ల కొత్త నిర్మాణాలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేవు.
పరిపాలన రాజధాని మాటేమిటి?
అంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని అనే మాటను పక్కన పెట్టేసింది. వికేంద్రీకరణ వైపు దృష్టి సారించింది. రాజధాని అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు, అభివృద్ధి వికేంద్రీకరించాలని శివరామకృష్ణ కమిటీ పేర్నొన్న అంశంపైనే దృష్టిపెట్టినట్టుంది. హైదరాబాద్‌లా ఒకేచోట కాకుండా 110 శాఖల కార్యాలయాలు వివిధ చోట్ల ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. దాంతో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. దీని అమలు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సచివాలయం, రాజ్ భవన్ లాంటివి విశాఖపట్నంలో ఉంటాయి.
ఆగస్టు 15వ తేదీ తర్వాత అమరావతి ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరువాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం. మంచి మూహూర్తం చూసుకొని రాజధాని నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అంటున్నారు. కాపులుప్పలపాడుతో సీఎం కార్యాలయం ఉంటుందని అంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాలను ఎంపిక చేశారు కూడా. ఇందులో కొంత కోర్టు పరిధిలోని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటినలా ఉంచుదాం. ఇప్పటికే వైజాగ్ మహానగరంగా విస్తరించి ఉంది. ఓ పక్క సముద్రం ఉంది. తాగు నీటి అవసరాల మాట ఎలా ఉంటుందో చూద్దాం.
తాగు నీరు విశాఖకు ఎక్కడి నుంచి…
సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు ధర్మాసనం, శాసనసభ విశాఖపట్నానికి తరలిస్తే తాగునీటి అవసరాల మాటేమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఇక్కడున్న పరిశ్రమలకు పెద్ద మొత్తంలో నీరు కావాలి. 2001లో ఎనిమిదిన్నర లక్షలున్న విశాఖ జనాభా 2011 లెక్కల ప్రకారం 17.28 లక్షలకు పెరిగింది. అంటే పదేళ్లలో రెట్టింపైంది. 2011 నుంచి ఇప్పటి వరకూ పెరిగిన జనాభాను కలుపుకొంటే ఇది 21 లక్షలపైన ఉంటుందని అంచనా. పరిసర గ్రామాల విలీనంతో విశాఖ మహానరమైంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి వంద ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీరు విశాఖకకు వస్తోంది. ఇందులో నుంచే పరిశ్రమలకు, తాగునీటికి అందిస్తున్నారు. ఇంతనీరు వస్తున్నా విశాఖలో ఏటా నీటి కష్టాలు ఉంటాయి. 2018లో తీవ్ర నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొన్నారు. వానలు పడకపోతే మాత్రం విశాఖకు నీటి కష్టాలు తప్పదు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందితే భవిష్యత్తులో నీటి కొరత ఉండకపోవచ్చు.