వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దెబ్బకు ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి దినదిన గండంగా మారిపోతే.. ఇప్పుడు అదే తరహా పరిస్థితి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి వచ్చేసింది. జగన్ ను టెన్షన్ లోకి నెట్టేసిన రఘురామరాజే ఇప్పుడు సాయిరెడ్డిని కూడా టెన్షన్ పెట్టేస్తున్నారు. మొత్తంగా వైసీపీ టికెట్ పై ఎంపీగా గెలిచిన రఘురామ.. పార్టీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న జగన్ తో పాటు నెంబర్ టై పొజిషన్ లో ఉన్నట్లుగా ఫోజు కొడుతున్న సాయిరెడ్డిలను ప్రమాదంలోకి నెట్టేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో అటు జగన్ తో పాటు ఇటు సాయిరెడ్డి కూడా నిందితులే. ఇద్దరూ జైలు జీవితం గడిపిన నేతలు. ఇద్దరు నేతలూ బెయిల్ పై ఉన్న నేతలే. వెరసి ఇద్దరినీ రఘురామరాజు తనదైన శైలిలో ఓ ఆటాడుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర సామంతరాజు
జగన్ అక్రమాస్తుల కేసులో సాయిరెడ్డే కీలకమన్న వాదనలు లేకపోలేదు. జగన్ పై నమోదైన దాదాపుగా అన్ని కేసుల్లోనూ రెండో నిందితుడిగా సాయిరెడ్డి పేరే ఉంది. ఈ క్రమంలో జగన్ తో పాటే సాయిరెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కంటే ముందుగానే బెయిల్ పై బయటకు వచ్చిన సాయిరెడ్డి.. అప్పటిదాకా తాను నిర్వహిస్తున్న, అకౌంటెన్సీ వ్యవహారాలను పక్కనపెట్టేసి రాజకీయ నేతగా కొత్త అవతారం ఎత్తారు. వైసీపీకి ప్రధాన కార్యదర్శి అయిపోయారు. ఆ తర్వాత వైసీపీకి దక్కిన తొలి రాజ్యసభ స్థానాన్ని కూడా ఆయనే దక్కించుకున్నారు. ఇక తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సాయిరెడ్డి.. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను స్వీకరించి.. ఉత్తరాంధ్రకు ఓ సామంతరాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామరాజు.. సాయిరెడ్డి కారణంగానే పార్టీకి రెబల్ గా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయంలో తన అనుమతి లేకుండా కదలరాదన్న సాయిరెడ్డి నియంతృత్వ పోకడల కారణంగానే రఘురామరాజు.. పార్టీపై తనదైన శైలి పోరు మొదలెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సాయిరెడ్డికి నోటీసులు
ఇలాంటి క్రమంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ఇదివరకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘురామరాజు.. జగన్ కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. రఘురామ పిటిషన్ నేపథ్యంలో తన బెయిల్ ఎక్కడ రద్దు అవుతుందోనన్న ఆందోళన జగన్ ను పట్టి పీడిస్తోంది. అయితే తన పోరు జగన్ వరకు మాత్రమే పరిమితం కాదన్న రీతిలో కొత్త అడుగు వేసిన రఘురామ.. సాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సాయిరెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ జరపున్నట్లుగా కోర్టు ప్రకటించింది. సాయిరెడ్డితో పాటు సీబీఐకి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. మొత్తంగా ఎక్కడ బెయిల్ రద్దు అవుతుందోనన్న బెంగతో జగన్ ఎలా టెన్షన్ పడుతున్నారో.. ఇకపై సాయిరెడ్డి కూడా అదే తరహా టెన్షన్ లో కొనసాగక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.