సినిమాని శిల్పం చెక్కినట్టు చెక్కడం వల్లే రాజమౌళి జక్కన్న అనే పేరు వచ్చింది. తనకు సంపూర్ణంగా నచ్చితేనేగాని రాజమౌళి సినిమా జనం ముందుకు రాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ అక్టోబరు 13 అని ప్రకటించేశారు. అలాంటప్పుడు ఇంకా సందేహాలెందుకు అన్న ప్రశ్న తలెత్తక మానదు. దసరాకు ఈ సినిమా విడుదలవుతుందా అంటే కాదు అన్న సమాధానం కూడా ఇంకో పక్క నుంచి వస్తోంది.
మరి ఆ స్థానంలో ఏ సినిమా విడుదలవుతుంది? అంటే మెగాస్టార్ ‘ఆచార్య’ అన్న సమాధానమే వస్తుంది. అక్టోబరు 13న ట్రిపుల్ ఆర్ ను విడుదల చేయాలనే లక్ష్యంతోనే చిత్ర యూనిట్ ఉంది. అదే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కూడా శరవేగంగా ముస్తాబవుతోంది. ఎప్పుడో పూర్తికావలసిన ‘ఆచార్య’ కరోనా కారణంగా ఆలస్యమైంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. విడుదల కావలసిన పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా ఏదో ఒక పర్వదినాన్ని ఎంచుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు.
వీటిలో సంక్రాంతి మీద చాలా మంది కన్ను సర్వసాధారణంగా ఉంటుంది. ఈసారి ఆ సమయంలో చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకవిధంగా ‘ఆచార్య’ కూడా మల్టీస్టారర్ సినిమానే. తండ్రీకొడుకులు పోటీపడి మరీ నటించారని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ విడుదల తేదీ మీద సందేహాలు ఉండటంతో ‘ఆచార్య’ను కూడా ముస్తాబు చేసి రెడీగా ఉంచుతున్నారు.
ట్రిపుల్ ఆర్ ఫైట్స్ అసాధారణమట..
ట్రిపుల్ ఆర్ ఫైట్స్ అసాధారణ రీతిలో తెరకెక్కినట్టు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి అది కూడా ఒక కారణమే. ఇందులో ఇద్దరూ సూపర్ హీరోలే. ఇందులోని ప్రతి ఫైట్ 10 నిమిషాలపాటు ఉంటుందని అంటున్నారు. మొత్తం 10 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణలో ఉంది. విడుదల తేదీకల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయా లేదా అన్నది మాత్రం సందేహాస్పదమే. అందుకు ఈ సినిమా విడుదల విషయంలో ప్లాన్ బి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అదేమిటంటే అక్టోబరు 13న విడుదల కాకపోతే వచ్చే ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే రోజున విడుదల చేయాలన్నది ఒక ఆప్షన్. సంక్రాంతికి చాలా సినిమాలు పోటీపడతాయి కాబట్టి అది సరైన సమయం కాదని భావించినట్టు తెలుస్తోంది. ప్లాన్ బి అమలైతే మాత్రం అక్టోబరు 13న విడుదయ్యేది మాత్రం ‘ఆచార్య’ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఏది విడుదలైనా మెగా అభిమానులకు శుభవార్తే కదా.











