ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజు వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్ నేపధ్యంలో గవర్నర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు అయింది. రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్‌కు హస్తిన నుంచి పిలుపు రావడంతో… సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..
ఏపీలో రాజకీయ పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక పార్లమెంటు సభ్యుడిపై సీఐడీ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేయడంపై రఘురామరాజు దేశంలోని అందరు ఎంపీలకు, సీఎంలకు, గవర్నర్లకు లేఖలు రాయడంతో పాటు, ప్రధాని కార్యాలయం, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. ఏపీలో అసలేం జరుగుతుంది అనే దానిపై గవర్నర్ నుంచి వివరణ కోరాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం.