సుదీర్ఘ ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని, జనసేన అధినేత పవన్ కూడా కార్యరంగంలోకి దిగాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం బీజేపీ మినహా అన్ని పార్టీలూ పోరాడుతున్నాయన్నారు. ప్రైవేటీకరణ ఆపమంటూ ఇప్పటికే జగన్, చంద్రబాబు ప్రధానికి లేఖలు రాశారని.. పవన్ కూడా ఢిల్లీ వెళ్లి తన వంతు ప్రయత్నం చేశారని తెలిపారు. ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకోకుండా రాష్ట్ర బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు.
ఉరిశిక్షకు ఆదేశాలేకదా ఇచ్చారు.. ఇంకా ఉరితీయలేదు కదా.. అన్నట్టుగా ఉంది బీజేపీ తీరు అని ఎద్దేవా చేశారు. ఇలాగే ఉంటే ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని హెచ్చరించారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన.. బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కేంద్ర పెద్దలను కలిశామని బీజేపీ నేతలు చెబుతున్నారు గానీ.. ఆ పెద్దలు ఏం చెప్పారో మాత్రం వారు చెప్పడం లేదని విమర్శించారు. ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు అందరూ కలిసి రావాలని గంటా శ్రీనివాసరావు కోరారు.