ఏపీ ముఖ్యమంత్రి ప్రజలను పాలిస్తున్నాడా? ప్రజలను హింసిస్తున్నాడా? అని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా దళితులను వేధించాలనే భావం కనిపించలేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో తప్పులను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల్లో కూడా హింసించి, కక్ష తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోందని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. మంత్రులు కనీసం వారి శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆ నలుగురు తప్పు మరెవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు పారేస్తే దళితులు ఓట్లేస్తారనుకుంటున్నారు
డబ్బులు పారేస్తే దళితులు ఓట్లేస్తారని అనుకుంటున్నారని ఏపీ సీఎం నుద్దేశించి హర్షకుమార్ ధ్వజమెత్తారు. దళితులు ఏమీ చేయలేరనే భావనతోనే ఇలా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దళిత సమాజమంతా మా చెప్పులు కడగడానికే అన్న విధంగా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. సామూహిక అత్యాచారం జరిగిన అమ్మాయికి రావాల్సిన పరిహారం నేటికీ అందలేదని హర్షకుమార్ గుర్తు చేశారు. సస్పెండైన జడ్జి రామకృష్ణను ఏడాది కాలంగా వేధిస్తున్నారని, ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. దళితులంతా ఏకం కావాలని, పార్టీలకు అతీతంగా పోరాడకపోతే దళితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఓ టీవీ చర్చావేదికలో హర్షకుమార్ అభిప్రాయపడ్డారు.











