ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై కఠిన చర్యలు తప్పేలా కనిపించడం లేదు. సునీల్ వ్యవహారంపై తమకు అందిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కు శనివారం లేఖ రాసింది. అంతేకాకుండా సునీల్ పై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కూడా ఆ లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. వ్యవహారం చూస్తుంటే.. సునీల్ పై చర్యలు తీసుకునేందుకు ఇష్టం లేకున్నా కూడా ఏపీ ప్రభుత్వం… ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
అంతా రఘురామరాజు ఎఫెక్టే
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ.. తన కస్టడీలోనే ఆయనపై ధర్డ్ డిగ్రీకి పాల్పడిందన్నది కీలక ఆరోపణ. ఈ ఆరోపణను స్వయంగా రఘురామరాజే చేశారు. ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగమేమిటన్న విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి బాధ్యుడిగా ఉన్న అందరి దృష్టి పడింది. అంతేకాకుండా రఘురామరాజు కూడా జగన్ సర్కారుతో పాటు తనపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే క్రైస్తవుడిగా ఉన్న సునీల్… ఎస్సీ కోటాలో ఉద్యోగం పొందారన్న విషయంతో పాటు హిందూ మతంపై విధ్వేషం చిమ్మేలా వ్యవహరిస్తున్నారన్న విషయాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా సునీల్ క్రియేట్ చేసిన ప్రత్యేక పేజీలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీటన్నింటిలో సునీల్ హిందువులను కించపరిచేలా వ్యవహరించారని తేలింది. వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన రఘురామరాజు.. సునీల్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సునీల్ ను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఏలాంటి చర్యలు తీసుకుంటారో?
రఘురామరాజు లేఖను కాస్తంత లోతుగానే పరిశీలించిన కేంద్రం.. సునీల్ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ ఐపీఎస్ అధికారిగా ఉంటూ.. ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించడమేమిటన్న కోణంలో ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఆపై రఘురామరాజు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కేంద్రం… సునీల్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని అంచనాకు వచ్చిందట. ఈ క్రమంలోనే శనివారం నాడు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. సునీల్ పై తమకు అందిన ఫిర్యాదుతో పాటు దానికి జత అయిన ఆధారాలను తన లేఖకు జత చేసిన కేంద్రం.. సునీల్ పై ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తంగా సునీల్ పై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితుల్లో జగన్ సర్కారు ఏ రీతిన వ్యవహరిస్తుందో చూడాలి.











