సినిమా రంగంలో వివిధ వృత్తుల్లో ఉండే వారికోసం ఏర్పడ్డ ‘చిత్రపురి’పై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి హౌసింగ్ సొసైటీని వేలకోట్ల రూపాయలను కొందరు పెద్దలు దండుకుంటున్నట్టు గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. సొసైటీ పనితీరు మీద చిత్రపురి సాధన సమితి ఈ ఆరోపణాస్త్రాలను సంధిస్తోంది. దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రత్యర్థుల ఆరోపణలకు సమాధానాలు ఇచ్చారు.
పాత కమిటీలో పనిచేసిన వారందరికీ నోటీసులు పంపించామని, చిత్రపురి సాధన సమితి స్వార్థపూరిత కారణాలతోనే ఆరోపణలు చేస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన తమ కమిటీ ఎంతో నిబద్దతతో పనిచేస్తోందన్నారు. గత 15 ఏళ్లలో జరిగిన పరిణామాలను వెల్లడించారు. గతంలో తాను సొసైటీ కార్యాలయంలో పనిచేసిన విషయం వాస్తవమేనని, తన పాత సభ్యత్వాన్ని రద్దు చేసుకుని కొత్తగా సభ్యత్వం పొందిన తర్వాతే ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన విషయాన్ని గుర్తుచేశారు.
నిబంధనల ప్రకారం ఫ్లాట్ పొందిన వారు ఎవరూ పదేళ వరకూ దాన్ని అమ్ముకునే హక్కు లేదని, కొందరు సభ్యులు తమకు లభించిన ఫ్లాట్లను వేరే వారికి అమ్మడం వల్లే బయటి వ్యక్తులకు ఫ్లాట్లు లభించిన భావన కలుగుతోందన్నారు. గతంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉంటే జరగవచ్చని, తమకు అది ఏ మాత్రమూ సంబంధం లేదని తెలిపారు. ఫ్లాట్ కేటాయింపు కమిటీ పరిధిలో జరగదని, కమిటీపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని, ఎంఐజీ, డూప్లెక్స్ కేటాయింపులు డిసెంబరు కల్లా ఇస్తామని వివరించారు.
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో 2019 వరకు ఎలాంటి వివాదాలు జరగలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి చిత్రపురి సాధన సమితి ఏర్పాటు చేసి సినీ పరిశ్రమతో సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నా ప్రత్యారోపణ చేశారు. వ్యక్తిగత లబ్ది కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. అతనికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తే అసలీ ఉద్యమమే ఉండదని ఎద్దేవా చేశారు.
కొత్త కమిటీ వ్యవహారాలన్నీ పారదర్శకంగా కొనసాగుతున్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే జనరల్ బాడీ మీటింగ్‌లో చర్చిద్దామని చెప్పినా వినకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. కస్తూరి శ్రీనివాస్ చరిత్ర ఏమిటో అందరికీ తెలుససని, అమెరికాలో లక్షలు ఎగ్గొట్టి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నాడన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి కాదంబరి కిరణ్, దీప్తి బాజ్ పేయి తదితరుల పాల్గొన్నారు.











