అమరావతి రాజధాని ఉద్యమాన్ని కించపరిచే విధంగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేయటంతో ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో జరిగేది ఫోటో ఉద్యమం అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మందడంలో నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా శ్రీదేవి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులెవ్వరూ తమ సమస్యలపై తనను కలవలేదని, రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సీఎం జగన్‌తోనే రాజధాని అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. రాజధాని ప్రాంతంలో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్డుపై వెళుతున్నప్పుడు వినతి పత్రాలు ఇస్తే ఎలా అంటూ తనను కలిసి తమ సమస్యలను చెప్పొచ్చని అన్నారు.
అడ్డుకున్న మహిళా రైతులు
సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవిని లింగాయపాలెం వద్ద దళిత మహిళా రైతులు, రాజధాని రైతులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని ఆమెను అక్కడ నుంచి పంపించారు. పులిచిన్న అనే దళిత రైతును పోలీసులు అదుపులోకి తీసుకుని ఎమ్మెల్యే వెళ్లాక వదిలి పెట్టేశారు. భూముల కౌలు, అమరావతి పింఛను కోసం వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్టులు చేస్తారా, స్థానిక ఎమ్మల్యే అయిన శ్రీదేవి తమ సమస్యలు పట్టించుకోరా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.











