దేశంలో జనరల్ ఎలక్షన్లు జరిగే ముందే ఒక ఓటరు లిస్టు తయారు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఓటరు లిస్టు తయారు చేస్తాయి. ఇలా ప్రతి ఎన్నికకు ఓటరు లిస్టు మారుతూ ఉంటుంది. ఒక లిస్టులో పేరు ఉందికన్నా అని ఆ తరవాత ఎప్పుడో జరిగే ఎన్నికల్లో ఓటు వేద్దామని వెళితే ఆ లిస్టులో పేరు ఉండకపోవచ్చు. అందుకే ఈ సమస్యలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ సాయంతో దేశమంతా ఒకే ఓటరు లిస్టు తయారీకి కసరత్తు ప్రారంభించింది. ఆయా రాష్ట్రాలను ఒప్పించి, అవసరం అయితే రాజ్యాంగ సవరణ చేసి అయినా దేశమంతా ఒకే ఓటరు లిస్టు తయారు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు సంకల్పించారు. అయితే దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
జమిలి ఎన్నికలకు సంకేతమా?
వన్ నేషన్, వన్ రేషన్ బాగానే ఉంది. కానీ వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఎందుకంటే ప్రతి ఎన్నికకు ముందు ఓటరు జాబితా సవరిస్తారు. ఎందుకంటే కొత్తగా 18 సంవత్సరాలు నిండినవారు తమ ఓటు నమోదు చేయించుకోవడం, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులు చనిపోయిన వారి ఓటు తొలగించమని కోరడం వంటి సవరణలు చేస్తూ ఉంటారు.
అందుకే ఒకే దేశం ఒకే ఓటరు లిస్టు తయారు చేసినా, ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలియదు. ఎందుకంటే దేశమంతా ఒకే ఓటరు లిస్టు తయారు చేసిన ఆరు నెలల తరవాత ఏదైనా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరలా కొత్తగా ఓటర్లను లిస్టులో చేర్చాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోతే తొలగించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతా ఒకే ఓటరు లిస్టు తయారు చేయడం అనేది ఎంత వరకు ఉపయోగపడుతుందోనని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దేశం మొత్తం ఒకే ఓటరు లిస్టు తయారు చేసి జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అందుకే, ఇలాంటి వివాదాస్పద అంశాన్ని తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. అయితే దేశంలో బీజీపీ నాయకుల ప్రభ కూడా రోజు రోజుకూ దిగజారుతోంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలకు వెళితే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకీ తంతు
దేశమంతా ఒకే ఓటరు లిస్టు ఉండాలంటే రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏ లను సవరించాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై ఎస్‌ఈసీలకు అధికారమిచ్చేవి రాజ్యాంగంలోని 243కే, 243జెడ్‌ఏ అధికరణలు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి అధికారమిచ్చేది ఆర్టికల్ 324(1). కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసే జాబితాలనే స్థానిక సంస్థలకు కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చజెప్పాలని చూస్తోంది. స్థానిక సంస్థలకు స్వయంగా ఓటర్ల జాబితా తయారు చేసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కల్పించారు. ఇప్పుడు దేశమంతా ఒకే ఓటరు లిస్టు అంటే, రాజ్యాంగ సవరణ తప్పనిసరి కానుంది. 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే కేంద్ర బీజేపీ ఈ సాహసానికి దిగిందని జాతీయ మీడియా కథనాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.











