అక్షరాస్యతలో ఫస్ట్ ఎవరంటే కేరళ అని, లాస్ట్ ఎవరంటే బీహార్ అని ఒకప్పుడు ఎవరిని అడిగినా టక్కువ వచ్చే సమాధానం ఇదే. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. నేషనల్ స్టాటిస్టికల్ సంస్థ చేసిన సర్వే విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, బీహార్ కన్నా చాలా వెనుకబడింది. 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ, 95 శాతంతో ఢిల్లీ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక ఏపీ 66.4 శాతంతో దేశంలోనే చివరిస్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో బీహార్ 70.9 శాతంతో ఏపీకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.నేషనల్ స్టాటిస్టికల్ సంస్థ 2017-18 సర్వే గణాంకాల విశ్లేషణ ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. అయితే ఈ ర్యాంకులు తప్పని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే వాలంటీర్ల సాయంతో అక్షరాస్యత వివరాలను ఇంటింటి సర్వే చేయిస్తోంది.
మా లెక్కలు మాకున్నాయి
అక్షరక్రమంలో రెండో స్ధానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత విషయంలో మాత్రం 29 స్థానానికి పడిపోయింది. బీహార్ కన్నా కిందకు పడిపోవడాన్ని వైసీపీ పెద్దలు అవమానంగా భావిస్తున్నారు. అయితే దీనికి కారణం గత పాలకులు అంటే చంద్రబాబునాయుడు కారణంగా చూపితే పోయేది. కానీ ఎందుకో మరి వైసీపీ నేతలు పప్పులో కాలేశారని అనిపిస్తోంది. 2017-18 గణాంకాల ప్రకారం ర్యాంకులు ఇచ్చారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. అంటే అప్పటికి వైసీపీ అధికారంలోకి రాలేదు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, అక్షరాస్యతలో ఏపీ బీహార్ కన్నా వెనుకబడింది అనే విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే హఠాత్తుగా వాలంటీర్లను పురమాయించి ఇంటింటికి తిరిగి అక్షరాస్యత సర్వే చేపట్టారు.
జాతీయ సగటుకున్న తక్కువ
ఏపీలో అక్షరాస్యత చాలా దారుణంగా ఉంది. జాతీయ సగటు కన్నా 11 శాతం తక్కువగా ఉండటం నిజంగా సిగ్గుచేటే. అయితే దీనికి ఏ ఒక్క పార్టీని కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రిని గానీ తప్పు పట్టలేం. ఎందుకంటే అక్షరాస్యత పెంపు అనేది నిరంతర ప్రక్రియ. ఏపీ వెనుకబాటుకు మాజీ ముఖ్యమంత్రులంతా బాధ్యత వహించాల్సిందే. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఏపీలో అక్షరాస్యత ర్యాంకులపై నేషనల్ స్టాటిస్టికల్ సంస్థ ఇచ్చిన గణాంకాలు తప్పు అని నిగ్గు తేల్చే పనిలో పడింది.
ఆ సలహాదారుడి సలహా మేరకే తాజా సర్వే…
ఏపీ ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు పనిచేస్తున్నారని ఎవరైనా అడిగితే చటుక్కున సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రతి వారం ఎవరో ఒకరు సలహాదారుడి పదవి పొందుతూనే ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వంలో 35 మంది సలహాదారులు నెలకు కనీసం రూ.3 లక్షల జీతం తీసుకుంటూ ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా పనిచేస్తున్నారని తెలుస్తోంది. వీరిలో ఒకరి సలహా మేరకే రాష్ట్రంలో అక్షరాస్యతపై వాలంటీర్లతో తాజాగా సర్వే చేయిస్తున్నారట. ఈ గణాంకాలను క్రోడీకరించి దేశంలో అక్షరాస్యతలో ఏపీ నెంబర్ వన్ అని నిరూపించాలని ముఖ్యమంత్రికి అతి దగ్గరగా వ్యవహరిస్తున్న సదరు సలహాదారుడు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ప్రారంభించారు. అసలు ఎలాంటి శిక్షణ లేకుండా సర్వేలు చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయని సలహాదారులకు మాత్రం తెలియకుండా ఉంటుందంటారా? ఏమో గుర్రం ఎగరా వచ్చు.