అమరావతి పరిరక్షణ ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. సఉద్దేశంతో అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు దారాదత్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై భరోసాతో వేలాది మంది రైతులు లక్షలాది ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం మారడం ఆ రైతుల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాలను తీసుకుంది. పనిలోపనిగా సీఆర్డీఏ బిల్లును కూడా రద్దు చేసింది. దీంతో ఆందోళనతో ఆ ప్రాంతపు రైతులు రోడెక్కారు.
నిమ్మకు నీరెత్తిన విధానం
రైతుల ఆందోళనను పట్టించుకోని జగన్ సర్కార్ ముందుకు సాగుతూనే ఉంది. వారితో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు కూడా జరిపింది లేదు. భరోసా కల్పించకుండా రైతుల ఉద్యమంపై అవాకులు చవాకులు పేల్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం ఈ ప్రాంతాన్ని శ్మశానంతో పోలిస్తే బొత్స సత్యనారాయణ వారు ఏకంగా అమరావతి కాదు భ్రమరావతి అంటూ కామెంట్ చేశారు. మంత్రి కొడాలి నాని అయితే శాసన రాజధాని కూడా ఇక్కడ ఉండరాదని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంత రైతులు హైకోర్టు గడప తొక్కారు. అక్కడ స్టేటస్ కో విధించడం వీరికి ఊరట లభించింది. కానీ కేంద్ర హోంశాఖ వీరి ఆశలపై నీరు చల్లింది.
మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే అంటూ స్పష్టం చేసిన కేంద్రం తాము జోక్యం చేసుకుబోమని తేల్చిచెప్పింది. దీంతో వారి ఆశలు ఆడియాశలయ్యాయి. రాష్ట్రపతిని సంప్రదించి తమ సమస్యను విన్నవించుకోవాలని రైతులు నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో హైకోర్టు దాఖలైన పీటీషన్లపై రోజువారీ విచారణ జరుపుతోంది.
చంద్రబాబు సంఘీభావం
అమరావతి పరిరక్షణ పేరిట ఉద్యమాన్ని ఆ ప్రాంతపు రైతులు మొదలు పెట్టారు. ఆ ఉద్యమానికి మొదటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ మద్దతు తెలిపారు. తాజాగా ఆ ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతపు రైతులకు అండగా చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ”అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు” జరపాలని చెప్పారు. రాత్రి నిరసన దీపాలు వెలిగించాలని తెలిపారు. ఎమ్మార్వో ఆఫీసుల ముందు ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ర్యాలీలో కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేయడం తప్పా వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీలేదంటూ మండిపడ్డారు. మూడు రాజధానులు పేరిట వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని నిప్పులు చెరిగారు. వైజాగ్, కర్నూలుకు కూడా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేసిందంటూ ప్రశ్నించారు. అధికారం లోకి వచ్చిన 18 నెలలో ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.