ఏపీలో పింఛన్ల పండుగ మొదలైపోయింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన పింఛన్ల హామీ నేటితో అమలవుతుండడంతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. గత రెండు నెలల బకాయిలు కూడా కలిపి ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. దీంతో ఇంత మొత్తం పింఛను ఒకేసారి.. అది కూడా ఇంటికి వెళ్లి అందించి.. చరిత్ర క్రియేట్ చేసిన సీఎంగా చంద్రబాబు నిలిచిపోనున్నారు. సోమవారం (జూలై 1) ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం అయింది.
కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ స్వయంగా చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆయనే తన చేతుల మీదుగా పింఛన్లను అందించారు. వేర్వేరు చోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయించి.. వారి నిర్వహణకు ఎంతో ప్రజా ధనం ఖర్చు చేయగా.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మానవవనరులను సక్రమంగా వాడుతోంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను అందిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛనును ఒకేసారి రూ.వెయ్యి పెంచిన సంగతి తెలిసిందే. 2014-19 మధ్య ఏకంగా రెండుసార్లు టీడీపీ ప్రభుత్వమే పింఛనును పెంచింది. 2014లో రూ.200 నుంచి రూ.వెయ్యికి.. మరో విడతలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు చేసింది. వైసీపీ మాత్రం 2019-24 మధ్య ఏడాదికి రూ.250 చొప్పున మాత్రమే రూ.వెయ్యి పెంచింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు ఏకంగా వెయ్యి పెంచి పింఛను మొత్తాన్ని రూ.4 వేలు చేశారు. ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టగా.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున మొత్తం ఈ నెల రూ.7 వేలను నేడు అందిస్తున్నారు. దివ్యాంగులు, కుష్ఠు కారణంగా వైకల్యం సంభవించిన వారికి ఏకంగా రూ.3 వేలు పెంచి.. రూ.6 వేలు అందిస్తున్నారు.
అయితే, పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారు లేదా వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి ప్రస్తుతం అందుతున్న రూ.5 వేల మొత్తాన్ని ఏకంగా రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలు చేశారు. అన్ని వర్గాలకు తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. అందుకే ఉదయం 6 నుంచి పంపిణీ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించగా.. కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ నేడు జరగనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.
అయితే, ఇంత మొత్తం పింఛను సాధ్యం కాదని వారిస్తూ వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. రూ.7 వేలను ఒకేసారి అందించడం సాధ్యం కాదు.. అందుకే నేను అలాంటి హామీ ఇవ్వడం లేదని జగన్ అప్పుడు పదే పదే చెప్పేవారు. అలవిగాని హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు.. అని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు దాన్నే చంద్రబాబు అమలు చేసి, వాలంటీర్లు లేకుండా అత్యంత సమర్థంగా ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్న తీరు చూసి జగన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో ఉండి షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది