ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రంలో మద్యం విషయంలో ఎన్ని అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని తీసేసి.. కొత్త కొత్త పేర్లతో లిక్కర్ ను వైన్ షాపుల్లోకి తెచ్చారు. వాటి రేట్లు అంతకుముందు కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ చేసి అమ్మడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త విధానంలో దోచుకోవడంతో మద్యం ప్రియులు బాగా విసిగిపోయారు. అలా దోచుకున్న డబ్బులు మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ కి తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.
పైగా అత్యంత నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్మేవారు. ఎక్కడా చూడనివీ.. మరెక్కడా వినని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరుతో ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించారు. ఇదంతా అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి హాయాంలో జరిగింది. జగన్ పంచన చేరి ఆయనకు ఊడిగం చేసి.. నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి తేవడంలో ఈయనే కీలక పాత్ర. అలాంటి వాసుదేవ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాడేపల్లి ప్యాలె్‌సకు ఎంత డబ్బు తరలించారో ఇప్పుడు ఏపీ సీఐడీ తవ్వి తీస్తోంది.
వైసీపీ ప్రభుత్వం దిగిపోగానే వాసుదేవ రెడ్డి తెలంగాణకు పారిపోయారు. ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం కుంభకోణాన్ని వెలికి తీస్తున్నారు. విజయవాడలోని ఏపీ బేవరేజెస్ కార్యాలయాన్ని ఇప్పటికే అధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్ చేయించారు. అందులోని సమాచారంతోపాటు డిలీట్ చేసిన వివరాలను కూడా నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు.
ఇప్పటి వరకూ సోదాల్లో లభించిన ఆధారాలను సేకరించి విశ్లేషిచిన సీఐడీ అధికారులు శుక్రవారం నాడు మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఏపీలో అసలు మద్యం కుంభకోణం ఎలా జరిగింది? ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలె్‌సకు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నా యి? ఎక్కువ ఆర్డర్ పొందిన మద్యం కంపెనీ ఏది? అనధికారికంగా ఎవరెవరు ఎంత ఇచ్చారనే అంశాలపై మొత్తం ఆరా తీస్తున్నారు. అసలు ఈ మద్యం కుంభకోణం వెనుక అసలు సూత్రధారి ఎవరు? ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణులతో సీఐడీ అధికారులు చర్చిస్తున్నారు.