ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే పర్యటిస్తూ ప్రజలను సాధారణ స్థితిరి తేవాలని పరితపిస్తుంటే ఆయనకు సాయంగా మరో మంత్రి కూడా తోడయ్యారు. ఆయనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రస్తుత విపత్తు ఆయన శాఖకు సంబంధించినదే. నిజానికి ఉదయం నుంచి రాత్రి పోయేవరకూ పని చేసి అర్థరాత్రికి విశ్రాంతి తీసుకోవచ్చు.. కానీ, నిమ్మల రామానాయుడు మాత్రం అర్ధరాత్రి సైతం క్షేత్ర స్థాయిలోనే గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రాత్రి పగలు అనే తేడా లేకుండా వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు.
ముంపు నుంచి విజయవాడ నగరం బయటపడే వరకూ తాను తిరిగి వెళ్లేది లేదని.. వర్షంలో కూడా విజయవాడలోని కాలువ గట్లపైనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడురోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఎడమగట్టు మూడుచోట్ల తెగిపోగా, కుడి గట్టుకు ఏడుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ వదద నీరంతా విజయవాడ నగరంతో పాటు దిగువ ఉన్న గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి పారుతోంది. ఈ వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే మంత్రి రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గురువారం రాత్రికల్లా ఈలప్రోలు, కవులూరు వద్ద గండ్లకు మరమ్మతులను అధికారులు పూర్తి చేయించారు. తర్వాత రాయనపాడు నుంచి సింగ్‌నగర్ వైపు వరద పోటెత్తగా, ఆ ప్రాంతంలోని మూడు భారీ గండ్లను పూడ్చే పనులు ఇప్పుడు చేస్తున్నారు. ఆ పనులను కూడా మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చేయిస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు నీళ్లు, బురద బాగా ఉన్నా కూడా.. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోయినా నడిచి వెళ్లి మరీ పరిశీలిస్తున్నారు.
తిండీ తిప్పలూ పట్టించుకోకుండా.. వాన పడుతున్నా, చీకట్లు ఉన్నా పట్టించుకోకుండా మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వ గట్ల నుంచి వెళ్లడం లేదు. అక్కడికే భోజనం తెప్పించుకొని పర్యవేక్షిస్తూ పనులు పూర్తిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, ఈయన క్షేత్రస్థాయిలో పనులను చూసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా నిమ్మల వెంట ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి చేపట్టిన డ్రోన్ సమీక్షలో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలోనే ఉన్నారు. అన్ని వివరాలను మంత్రి సీఎంకు వివరించారు.
మరోవైపు, బుధవారం మంత్రి లోకేశ్ కూడా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాల్వకు గండ్లు పడటమే కాబట్టి, వీటిని పూడ్చితేనే నగరానికి రక్షణ అని భావిస్తున్నారు. దగ్గరుండి చేయిస్తేనే ఏ పని అయినా త్వరగా అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం కాబట్టి.. తాను అదే స్ఫూర్తిని పాటిస్తున్నానని నిమ్మల రామానాయుడు అన్నారు. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు తేల్చి చెబుతున్నారు. మంత్రి రామానాయుడు పనితనాన్ని చూసిన స్థానికులు సైతం ఆయన నిబద్ధతపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.











