ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్. ఐటీ పరిశ్రమ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో దాదాపు 25 ఏళ్ల క్రితం చంద్రబాబుతో తాను సన్నిహితంగా పని చేశానన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో TCS సహా పెద్ద ఐటీ కంపెనీలు కనిపిస్తున్నాయంటే దాని వెనుక చంద్రబాబు కృషి ఎంతగానో ఉందన్నారు. అప్పట్లో చంద్రబాబు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారని. ఉదయం 6 గంటలకే మీటింగ్స్ నిర్వహించేవారని చెప్పుకొచ్చారు. బుధవారం నిర్వహించిన CII సదస్సులో మాట్లాడారు చంద్రశేఖరన్.
ఇప్పుడు ఏపీ ఆర్థికాభివృద్ధి నివేదిక రూపొందించే అవకాశం దక్కిందని..ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ GDP దాదాపు 170 బిలియన్ డాలర్ల మేర ఉందన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఏటా 15% వృద్ధి సాధించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఉంటే అది సాధ్యమేనన్నారు చంద్రశేఖరన్. ఈ నివేదికలో ప్రతి జిల్లాలో తలసరి ఆదాయాలు, అందులో మొదట, చిట్టచివర ఉన్న జిల్లాల గురించి చెప్పాం. ఆంధ్రాకు చాలా బలాలున్నాయి. అందులో ప్రధానమైంది అత్యధిక సంఖ్యలో ఉన్న ఐటీ ఉద్యోగులు. ఇందులో చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హోదాల్లో ఉన్నారు.టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్‌గా నన్ను నియమించినట్లు వార్తలు రాగానే తామెలా సహాయపడగలమో చెప్పాలంటూ నాకు మెయిల్స్ పంపారని చెప్పారు చంద్రబాబు.
చంద్రబాబుకు చాలా గుడ్‌విల్ ఉందన్నారు చంద్రశేఖరన్. అందుకే చాలామంది రాష్ట్రానికి వచ్చి చేయూత ఇవ్వాలనుకుంటున్నారు. అందువల్ల టెక్ ఇండస్ట్రీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడం పెద్ద కష్టం కాబోదని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పిస్తే మిగతావన్నీ జరిగిపోతాయన్నారు. వ్యవసాయం, ఆహారం, పెట్రోకెమికల్స్, మైనింగ్ లాంటి రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. వీటన్నింటి గురించి నివేదికలో చెప్పామన్నారు.











