రాష్ట్రంలో పరిపాలన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాలంటే.. కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప సాధ్యం కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా వేక్సినేషన్ జరుగుతున్న సమయంలో.. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు బెంచ్ తీర్పును రద్దు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును, తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా రూపాల్లోనా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉండే 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా జగన్ సర్కారు పెట్టుకున్నదని చంద్రబాబు విమర్శించారు.
ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం అని చంద్రబాబునాయుడు అన్నారు. పంచాయితీ ఎన్నికలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని, నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయితీ ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చంద్రబాబునాయుడు కోరారు.
Must Read ;- ఎన్నికలంటే చంద్రబాబుకే భయం: ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్