ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్న జీవీ సాయిప్రసాద్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నిక సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయడంపై ఉద్యోగ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం సంచలనంగా మారిన వేళ.. ఎన్నికల సంఘం జాయింట్ డైరక్టర్ పదవి నుంచి సాయిప్రసాద్ తొలగింపు ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశమైంది.
గతంలో తెరపైకి సాయిప్రసాద్ పేరు..
ఇక ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ పేరు గతంలో ఓ సారి తెరపైకి వచ్చింది. కొవిడ్ తీవ్రత కారణంగా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ అప్పట్లో నిర్ణయం వెలువడడం, దీనిపై అధికార వైసీపీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని తొలగిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సాయిప్రసాద్ వెంటనే బాధ్యతలు తీసుకునేలా ఉత్తర్వులు ఆయనకు ఆయనే జారీచేసుకున్నారన్న ప్రచారం జరిగింది. తరువాత మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలబడలేదు. మళ్లీ రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ నడుస్తోంది.
చెప్పకుండా సెలవు..
ఇక జీవీ సాయిప్రసాద్ తొలగింపు ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ చెప్పకుండా, సమాచారం లేకుండా 30 రోజుల పాటు సెలవు పెట్టడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. దీంతోపాటుగా ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడంతో పాటు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న సమాచారం ఉందని ఎస్ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యాక ఇలాంటి ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ అంశంపై విచారణ జరిపాకే నిర్ణయం తీసుకుంటున్నామని ఉత్తర్వుల్లో ఉంది. ఇలాంటి ఒకరిద్దరు అధికారుల ప్రవర్తన వల్ల..ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందున ఈ అంశాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.
వెంటనే అమల్లోకి..
కాగా ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఉద్యోగ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఎన్నికల సంఘం సహించబోదని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎస్ఈసీ తనకు ఉన్న అధికారాలకు లోబడి సంయుక్త కార్యదర్శి జీవీ సాయిప్రసాద్‌ను వెంటనే పదవి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఇది అగౌరవప్రద తొలగింపు కాదని, నిబంధనలను అతిక్రమించింనందున తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. మరి ఎస్‌ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రకంపనలకు దారి తీస్తుందో చూడాలి.