‘ఒక ఉద్యోగి.. ఉద్యోగ సంఘాన్ని లేదా ఉద్యోగ సంఘ నేతను కాదని, ప్రభుత్వ పెద్దల అభీష్టాన్ని కాదని తన విధులు నిర్వర్తించే పరిస్థితి ఉంటుందా? ఒక వేళ విధులు నిర్వర్తిస్తే..సదరు ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తితే.. సదరు ఉద్యోగికి జీవితాంతం ఇబ్బందులు తప్పవు అనే జవాబే వస్తోంది. ఆ ఇబ్బందులు చట్టానికి దొరకవు..చేతికి చిక్కవు.. కాని ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఏపీలో కొందరు ఉద్యోగుల పరిస్థితి అదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఖరి మారుతుందా?
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యల తరువాత ఉద్యోగ సంఘాల నేతల మాట తీరులో మార్పు కనిపిస్తున్నా.. వైఖరి మారుతుందా అనే ప్రశ్న తలెత్తోంది. పైకి తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని, వద్దని చెప్పడం లేదని, ఎన్నికల విధులకు వెళ్లేవారు వెళ్లవచ్చని పైకి చెబుతున్నా.. అంతర్లీనంగా బెదిరింపు ఉద్దేశం కూడా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరు ఎలా ఉంటుందనే అంశంపై చర్చ మొదలైంది.
గత శని, ఆదివారాల్లో కొన్ని సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. ప్రాణ రక్షణ కోసం అవసరమైతే చంపుతామనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. కాకర్ల వెంకట్రామిరెడ్డి కదలికపై నిఘా ఉంచాలని కూడా కోరారు.
Must Read ;- వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?
ఆయన కుటుంబీకులకు వైసీపీ టిక్కెట్ ఆశించారా?
ఇక వెంకట్రామిరెడ్డి 2014లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఎన్నికల్లో ఆయన కుటుంబీకులకు వైసీపీ టిక్కెట్ ఆశించారని, ఆ టిక్కెట్ వచ్చినా.. వెంకట్రామిరెడ్డి సర్వీసులో ఉండడం నియమావళికి విరుద్దమన్న అభిప్రాయం నేపథ్యంలో పోటీ చేయలేదని, టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేక కామెంట్లు చేయడంతో పాటు..వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేశారని, అమరావతికి ఉద్యోగుల తరలింపులోనూ రాజకీయం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కొమ్ముగాస్తున్నారనే చర్చ నడిచింది. తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వ్యవహారంలో మీరు ఎలా తలదూర్చుతారని, అసలు పిటిషన్ వేయడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది. లాలెస్ వ్యవస్థకు ఇది దారి తీస్తుందని, తాము అందుకు అనుమతించబోమని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మీరు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ఇగోలు తగ్గించుకోవాలని, ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది.పిటీషన్‌లో SECపై అనవసర వ్యాఖ్యలు చేశారని, ఆయన రిటైర్మెంట్‌పై ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందని, ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే రాష్ట్రంలో చట్టం అమలు కావడం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిర్వహించడానికి సమస్య ఏంటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు ఎలా స్పందిస్తారనే చర్చ మొదలైంది.
Also Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!
సుప్రీంకోర్టు తీర్పు తరువాత సంఘాల నేతల వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తాము గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయమే ఇప్పుడు వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నామని, కొత్తవాళ్లతో జరుపుకోవాలని కోరుతున్నామని, మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవిస్తామని వ్యాఖ్యానించారు. తాము మొదటి నుంచి ఒకటే చెబుతున్నామని, ప్రాణాల రక్షణ కోసమే..తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని, 4లక్షల వలంటీర్లు, కొత్త సెక్రటరీలతో చేయవచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు మరో ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తాము పిటిషన్ వేయలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి ఆ పిటిషన్ కారణంగానే ఈ కేసు బెంచ్ మారింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ కేసు నెంబరు 39కాగా ఉద్యోగులు వేసిన పిటిషన్ నెంబరు 40. అయితే ఉద్యోగుల పిటిషన్ తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు కార్యాలయంలో పనిచేసినందున నాట్ బిఫోర్ మి అనే అభిప్రాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బెంచ్ మారింది. మరి పిటిషన్ వేయలేది బొప్పరాజు చెబుతున్న నేపథ్యంలో.. ఈ పిటిషన్‌కు ఆయన సంఘానికి సంబంధం ఉన్నట్లా..లేనట్లా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఏపీ ఎన్జీవో అధ్యక్షుదు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికలకు వ్యతిరేకం కాదని, ఉద్యోగుల భధ్రతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నేతల ప్రకటనలు పైకి ఎలా ఉన్నా.. ఎంతవరకు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఉద్యోగ హక్కుల కోసం పోరాడేందుకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్యోగ సంఘాలు.. ఇప్పుడు ప్రభుత్వానికి లొంగిపోయారనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వారి కార్యాచరణ ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతలు ఏకంగా వ్యవస్థలను టార్గెట్ చేసినందునే సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యానించిందని, రానున్న కాలంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ గౌరవాన్ని కాపాడుకోవాలంటే వైఖరి మార్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- అయినా సరే.. తొడకొడుతున్న జగన్!