ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఎన్నికల నిర్వహణకు తాము సహకరిచబోమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తరువాత సదరు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనకూడదని తాము చెప్పడం లేదని, ఉద్యోగుల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలున్నవారిని మినహాయించాలని కోరతామన్నారు. వీరి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ఎన్నికలకు రాష్ట్ర ఉద్యోగులు ఎంతవరకు సహకరిస్తారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సహకరించే అవకాశాలు కనిపించడం లేదని, కేంద్ర ఉద్యోగులను లేదా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆ లేఖ సారాంశం. ఈ అంశమే ఇప్పుడు రాజకీయాల వర్గాల్లో చర్చకు కారణమైంది.
రాష్ట్రం సహకరించకుంటే..
ఇక ఎన్నికల సంఘాల ఏర్పాటు రాజ్యంగబద్ధమైనప్పుడు.. వాటి విధి విధానాల అమలు కూడా రాజ్యాంగంలో పొందుపర్చారు. ఎన్నికల సంఘంతో సమన్వయంతో పని చేయాల్సిన వ్యవస్థలు సహకరించనప్పుడు ఎన్నికల సిబ్బంది కేటాయింపును కూడా కేంద్రం పర్యవేక్షించవచ్చు. అందులో గవర్నర్‌ని కూడా భాగస్వామిని చేయవచ్చు. అందుకు 243 కే (3) నిబంధన ఉందని, అవసరమైతే గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఒక వేళ రాష్ట్రంలో ఉద్యోగులు సహకరించని పక్షంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు, గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటైర్ అయిన ఉద్యోగులు, ఎక్స్ ఆర్మీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగుల తరలింపు అంశాలు కేంద్రం ముందుంటాయి. 99శాతం అలాంటి పరిస్థితి రాదని, ఒక వేళ ఆ పరిస్థితే వస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కోర్టు ధిక్కరణ, రాజ్యాంగ విచ్ఛన్నం, హక్కుల ఉల్లంఘనతో పాటు ఓటు వేసే హక్కుకు భంగం వాటిల్లేలా వ్యవహరించారనే అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది క్రమేణా 356 అధికరణను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Must Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!
పంజాబ్‌లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
గతంలో పంజాబ్‌లో అల్లర్లు, అయోధ్య ఘటన సమయంలో యూపీలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో కేంద్రం అదనపు పోలీసు బలగాలను పంపించింది. కేంద్ర పరిధిలోని విభాగాల్లోని ఉద్యోగులను కేటాయించింది. పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం బలంగా ఉన్న సమయంలో 1984లో బింద్రన్ వాలే మరణం తరువాత పరిస్థితులు చక్కబడక ముందే ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే మెజార్టీ వర్గాలూ ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి కనిపించకపోవడంతో హర్యానా నుంచి సిబ్బందిని కేంద్రం పంపించింది. వారిపైనా దాడి జరుగుతుందేమోనన్న అనుమానంతో అప్పట్లోనే 24వేల మంది భద్రతా సిబ్బందిని కేటాయించడం సంచనలమైంది. దీనిపై కచ్చితమై ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. యూపీలోని ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల కోసం 1990ల్లో కేంద్రం జోక్యంతో సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల సిబ్బందిని వినియోగించారు. ఆ తరువాత ఒక రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తంగా కేంద్ర సిబ్బంది వచ్చిన దాఖలాలు లేవని చెబుతారు. జమ్మూకశ్మీర్ ఉగ్రవాద చర్యలు , అరుణాచల్ ప్రదేశ్ , అస్సాంలలో పర్వత ప్రాంతాల కారణంగా ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
Also Read ;-వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?
ఈశాన్య భారతంలో..
అరుణాచల్ ప్రదేశ్‌లో మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్‌సభ పరిధిలోని మియావో అసెంబ్లీ పరిధిలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హెలీకాప్టర్ల ద్వారా ఐదురోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 8 గంటల పాటు హెలీకాప్టర్, 6 గంటల నడక తరవాత ఇద్దరు పోలీసులు, ఐదుగురు సిబ్బంది, సహాయకులను కేంద్రమే పంపిస్తుంది. ఆ రాష్ట్రంలోనే మరో పోలింగ్ కేంద్రానికి ఇలాగే పంపించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు ఉన్న మాలోగాం గ్రామానికి కేంద్రం స్వయంగా ఎన్నికల సిబ్బందిని పంపించింది. చైనా సరిహద్దున ఉండే ఈ గ్రామంలో ఒకే ఒక్క ఓటరు సొకేలా టయాంగ్ ఉన్నారు. హోయులింగ్ అసెంబ్లీ పరిధిలో ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే.. పర్వతాలు, సెలయేళ్లు దాటి వెళ్లాలి. దీంతో అక్కడికి కూడా కేంద్రమే స్వయంగా అక్కడి ఎన్నికల సంఘ సహకారంతో సిబ్బందిని పంపుతుంది. ఇవి మినహా సాధారణ ఎన్నికల సిబ్బంది కేటాయింపులు అంతర్ రాష్ట్ర పరిధిలో జరగలేదని చెప్పవచ్చు. భద్రతా బలగాలు, పరిశీలకుల తరలింపులు సాధారణమే. అయితే, రాష్టం మొత్తానికి కేంద్రమే ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసే పరిస్థితి తలెత్తలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read ;- మొదటి దశ పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్!