(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఎన్నికలంటే చంద్రబాబుకే భయమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం
ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసే చంద్రబాబు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి దిగడం హేయమైనచర్య అని అన్నారు. దేశంలో కరోనా వచ్చిన నాటి నుంచీ దానికి భయపడిన తండ్రీకొడుకు చంద్రబాబు, లోకేష్ తెలంగాణలో తలదాచుకుని అప్పుడప్పుడూ జూమ్ మీటింగులతో కాలక్షేపం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అటువంటి చంద్రబాబు తమ ప్రభుత్వంపై ఇలా బురదజల్లాలని ప్రయత్నిస్తుండడం నీతిమాలిన చర్య అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే తాము చెబుతున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా మెలిగి ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. దీనిని ఏదో రాజకీయం చేసి లబ్ది పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తుండడాన్ని రాష్ట్ర ప్రజంతా గమనిస్తున్నారని అన్నారు.
ప్రజలకు ఏది అవసరమో ..
ప్రజల సంపూర్ణ ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆచరిస్తున్న, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో ముఖ్యమైనదని, దీనిని అడ్డుకోవడానికి చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆగదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని అనుచరులు ప్రజలకు ఏది అవసరమో అవగాహన పెంచుకుని రాజకీయాలు చేస్తే హర్షణీయంగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు.
Must Read ;- వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్