చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన ‘భీష్మ’తో మంచి హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తను ఏకకాలంలో మూడు సినిమా షూటింగ్ లు చేస్తూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ‘చెక్’, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అంధధూన్’ రీమేక్ లాంటి సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ సినిమాతోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ‘చెక్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపించనున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్, సాయి చంద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని వారు తెలిపారు. ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చినా కాదన్నామని, ఎట్టి పరిస్థితిలో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉందని, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ కథని అద్భుతంగా తెరకెక్కించాడని నిర్మాతలు తెలిపారు.
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం నితిన్ యాక్టింగ్ అని, ఆయన ఇప్పటి వరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించారని తెలిపారు. ‘చెక్’ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై నితిన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ వైవిధ్యంగా ఉండడమే. ఈ సినిమా నితిన్ అభిమానులను ఎంతగా అలరిస్తుందో చూడాలి మరి.











