ఎన్నికల ముందే కరోనాకు మందు విడుదల చేస్తానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు.. కరోనా బారిన పడడంతో చైనీయులు ఆయన పట్ల హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలతో ట్విట్టర్లలో స్పందిస్తున్నారు. మిగతా దేశాలేమో ట్రంప్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తుంటే చైనా మాత్రం తమ వెకిలి బుద్ధిని ఇలా బయటపెడుతోంది.
ఎవ్వరినీ వదలని కరోనా..
కరోనా మహ్మమారి దేశ అధ్యక్షులను కూడా వదలడంలేదు. వారిపైన కూడా తన ప్రతాపం చూపిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ట్రంప్ మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. అందులో.. తాను ఆసుపత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. మెలానియా ట్రంప్ కూడా బాగానే ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు.
వైట్ హౌజ్‌ను వదిలి ఆసుపత్రికి..
ప్రపంచంలోని ఇతర దేశ అధ్యక్షులకు తమ అధికారిక భవనాలలో ఉండే సౌకర్యాలతో పోలిస్తే అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లో ఉండే సౌకర్యాలు ప్రత్యేకమైనవి. సకల సౌకర్యాలు వైట్ హౌస్ లోనే ఉంటాయి. ఏదీ లేదనకుండా అధ్యక్షుని చెంతకు వచ్చి చేరుతుంటాయి. మరీ అలాంటి అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ వైట్ హౌస్‌ను విడిచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అనుకుంటే వైట్ హౌజ్‌లోనే తాను చికిత్సను పొందవచ్చు. కానీ డాక్టర్ల సలహా మేరకు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవడం గొప్పవిషయమని అంతా అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్ కొవిడ్ నుంచి వెంటనే కోలుకోవాలని అభిలాషిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు సందేశాలు అందుతున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు. తన మిత్రుడు ట్రంప్, ఆయన సతీమణి కొవిడ్ నుంచి కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరికొంత మంది ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతున్నారు.











