దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ ప్రాంతం, యుపీ రాష్ట్రం అట్టుడుకుతోంది. హత్రాస్ ఘటన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. నిర్భయ, దిశ ఘటనలు మరువక ముందే హత్రాస్ ఘటన జరగడం దురదృష్టకరం. హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
పాఠాలు ఏం నేర్పుతున్నాయి?
నిర్భయ ఘటన జరిగి ఆ ఘటన తాలుకు రక్తపు మరుకలు తడి ఆరాక ముందే హైదరాబాద్ కేంద్రంగా దిశ హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన తాలూకు చేదు జ్ఞాపకాలు మరువక ముందే యుపిలో జరిగిన హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నా వ్యవస్థలో ఏమాత్రం మార్పు రావడంలేదు. దోషులకు ఉరి శిక్షలు విధించినా? ఎన్‌కౌంటర్లు చేసినా? ఒకదానితరువాత మరొకటి ఇలాంటి ఘటనలు జరగడం యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవలసి వస్తోంది. రోజుకు ఎన్నో ఇలాంటి అత్యాచార ఘటనలు దేశ నలుమూలల ఎక్కడోచోట జరుగుతునే ఉన్నా వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అవి కూడా చాలా ఆలస్యంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగాక వెలుగులోకి వస్తున్నాయి. కామ కోరికలతో మహిళలపై పశువులా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా శిక్షలు విధించాల్సిన ప్రభుత్వాలే మౌనంగా ఉండడం సరైంది కాదు. నిందితులను కాపాడే ప్రయత్నం యూపీ పోలీసలు, అక్కడి ప్రభుత్వం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అమానవీయంగా..
సెప్టెంబరు 14 నుంచి కనిపించకుండా పోయిన బాధిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నాలుక కోసి, వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలు చేశారు. సెప్టెంబరు 22న ఊరి బయట అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని కొందరు గుర్తించి వైద్యం కోసం తరలించారు. తొలుత అలీగఢ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో ఢిల్లీకి తరలించారు. మంగళవారం సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించడంతో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి.
అట్టుడుకుతున్న జంతర్ మంతర్..
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ సామాజిక ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నిరసన బాటపట్టారు. అలాగే బాధితురాలికి మద్దతుగా గ్రామానికి వెళ్లేందుకు రాహుల్, ప్రియాంక గాందీ, ఇతర రాజకీయ నాయకులు పోటెత్తుతుండటంతో వారిని పోలీసులు నిలువరిస్తుండటం ఆందోళనకు మరింత దారితీస్తుంది.
ఇదిలా ఉంటే, ఖాకీల తీరుతో వివాదం ముదురుతోందని భావించిన యోగి సర్కార్.. ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎస్పీ, డీఎస్పీ సహా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మృతురాలి గ్రామంలో ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఆ ఊళ్లోకి మీడియాను, రాజకీయ పార్టీ నేతలను కూడా అనుమతించ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో హత్రాస్ ఘటనను నిరసిస్తూ అటు యూపీ ఇటు దేశరాజధాని ఢిల్లీ ఆందోళనతో హోరెత్తుతోంది.











