మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోగా ఎన్నో గొప్ప విజయాలు సాధించి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు చిరు. మొన్నీమధ్య ‘కొణిదెల ప్రొడక్షన్స్’ అనే పేరుతో బ్యానర్ స్థాపించి వరుసగా విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నాడు చిరు తనయుడు చరణ్ . ప్రస్తుతం చిరంజీవి ఫిల్మ్ స్టూడియోను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
హీరోలు స్టూడియోలను నిర్మించడం కొత్తేమి కాదు. అక్కినేని నాగేశ్వర్రావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియో, సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన పద్మాలయ స్టూడియోలు మంచి విజయపధంలో నడిచాయి. రీసెంట్ గా అల్లు అరవింద్ ‘అల్లు స్టూడియో’ అనే పేరుతో ఒక స్టూడియోను నిర్మించడానికి గండిపేట్ ప్రాంతంలో భూమి పూజ కూడా చేశారు.
ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. ఆయనకి చాలా కాలం నుంచి ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే కోరిక ఉంది. కానీ అదికాస్త ప్లానింగ్ దశలోనే ఆగిపోవడం జరుగుతూ వచ్చాయి. అందుకే ఈసారి మాత్రం పక్కాగా ప్రణాళిక వేసుకుని చిరు రంగంలోకి దిగుతున్నారట. హైదరాబాద్ లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో స్టూడియో కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారని సమాచారం. ఇప్పటికే స్టూడియో నిర్మాణం కోసం గవర్నమెంట్ కు పర్మిషన్ కూడా పెట్టారంట.
ప్రభుత్వం నుండి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయితే ఈ స్టూడియోలో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయట. సినిమా షూటింగ్లకు, రియాలిటీ షోలకు అనువుగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో, సకల సౌకర్యాలతో ఈ ఫ్లోర్లను నిర్మిస్తారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నుండి అధికారిక ప్రకటన రానున్నదని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.











