కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. ఆ వైరస్ ని కూడా విస్తుపోయేలా చేస్తోంది ఓ సినిమా. అదే హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’. ఇక ఇప్పట్లో మనముందుకు సినిమాలు రావు అని జనం అనుకుంటున్న తరుణంలో ‘టెనెట్’ విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడా చిత్రం సాధించిన కలెక్షన్లు చూసి కరోనా వైరస్ కూడా నోరెళ్లపెడుతుందేమో. అక్షరాలా 307.1 మిలియన్ డాలర్లను ఆ చిత్రం వసూలు చేసింది. మన దేశం మొహాన్ని ఈ సినిమా ఇంకా చూడకపోయినా చాలామంది దీన్ని చూసేశారు. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు నెలలో 26 వ తేదీన కొన్ని దేశాల్లో ఈ సినిమా విడుదలైంది.
జనం కరోనా భయంతో ఉండటంతో టెనెట్ విడుదలకాగానే ఊహించినంత ఫలితం మాత్రం రాలేదు. ఇది కేవలం జేమ్స్ బాండ్ తరహా సినిమా. ముఖ్యంగా కాలంతో ప్రయాణం సాగించడం అన్నమాట. ఈ కాలంతో జరిగే ప్రయాణంతో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఆపాలన్న కథా వస్తువుతో దీన్ని తెరకెక్కించారు. విడుదలైన మొదటివారంలో 53 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో లెక్కిస్తే 387 కోట్లు వసూలు చేసింది. ఒకవిధంగా కరోనా కాలంలో అంత వసూళ్లు సాధించడం కూడా గొప్ప విషయమే. ఈ సినిమా ప్రమోషన్ కు టామ్ క్రూజ్ కూడా సహకరించారు.
జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ లాంటి నటులతో వార్నర్ బ్రదర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. దీని నిర్మాణ వ్యయం 225 మిలియన్ డాలర్లు. ఇప్పుడు 307 మిలియన్ డాలర్లు వసూలు చేసేసింది కాబట్టి ఈ సినిమా లాభాల బాట పట్టినట్టే. ఇంకా సినిమా విడుదల కావలసిన దేశాలు ఉన్నాయి. సినిమా ఫలితం మీద మొదటి నుంచి అనుమానాలు ఉన్నాఅవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. మన థియేటర్లు ప్రారంభమైతే ఈ సినిమా కూడా విడుదలైనట్టే.