గ్రేటర్‌లో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మచ్చిక చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. ఇందులో భాగంగానే తమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈరోజు నగరంలో ఒకటి ఆసక్తికరమైన సంఘటన బిజెపి, తెరాస పార్టీల మధ్య జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్, బిజెపి పార్టీ నేతలు బస్తీల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. బస్తీలను చుట్టుముట్టి పోటాపోటీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బిజెపి పార్టీ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఓబిసి జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌తో కలిసి ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఈరోజు పరిశీలించారు.
అయితే ఈ పర్యటనలో ఆయనకు చోదుఅనుభవం ఎదురైంది. తెరాస కార్యకర్తలు బిజెపి నేతలకు షాక్ ఇచ్చారు. ఆయన కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు హడావుడి సృష్టించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలిస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ హేమలత, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని బిజెపికి పోటీగా ఇళ్లను పరిశీలించారు. తెరాస కార్యకర్తల తీరుతో అసహనం చెందిన కిషన్‌రెడ్డి లక్ష్మణ్‌తో కలిసి అక్కడి నుండి వెనుదిరిగినట్లు తెలిసింది.
గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మధ్య డబుల్ బెడ్‌రూమ్ వార్ జరిగిన విషయం తెలిసిందే.










