వెండితెర అనేది ఒక సరస్సు అయితే అందులో విరిసిన తాజా తామరపువ్వు జయలలిత. వెండితెర అనేది ఒక ఉద్యానవనమే అయితే కొమ్మ కొమ్మకు ‘లత’లా అల్లుకున్న కోమలి జయలలిత.
వెండితెర అనేది పాల నురగలాంటి ఆకాశమే అయితే, అందులో తెప్పలా తేలే అందమైన చందమామ జయలలిత. ఒక్కమాటలో చెప్పాలంటే సుకుమారం .. సున్నితత్వం రెండూ కలగలిసిన సౌందర్య పుష్పం జయలలిత. ముద్దబంతిలా మురిపించే మోము .. కలువ రేకులు సైతం చిన్నబుచ్చుకునే కళ్లు .. చామంతుల్లా విచ్చుకున్న చెక్కిళ్లు .. పగడాలు పరచుకున్న పెదాలు .. కుందనపు బొమ్మలా కనిపించే కుదురైన రూపంతో జయలలిత కనిపిస్తుంది. రూపానికి తగిన స్వరం ఆమెకి లభించిన మరో వరం. ఆమె జీవితంలోకి తొంగిచూస్తే, అందం .. అభినయం .. అదృష్టం కలిస్తే జయలలిత, కృషి .. పట్టుదల .. కార్యదీక్ష గెలిస్తే జయలలిత అనే విషయం అర్థమవుతుంది.
జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’ .. ఆమె తల్లిదండ్రులు జయరామ్ – వేదవల్లి. అప్పటి మైసూర్ రాష్ట్రంలోని ‘పాండవపుర’ తాలూకాలోని ‘మెలుకోటే’లో ఆమె జన్మించారు. తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించిన ఆమెను, ‘జయలలిత’ అనే పేరుతో స్కూల్లో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె అదే పేరుతో కొనసాగుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆమె కడిగిన ముత్యమే .. ఎంతమందిలో ఉన్నా తళుక్కున మెరిసే రత్నమే. చాలా తెలివైన అమ్మాయిగా .. చురుకైన పిల్లగా స్కూల్ రోజుల్లోనే ఆమెను గురించి చెప్పుకునేవారు. ఆటపాటల్లోను .. జనరల్ నాలెడ్జ్ లోను ఆమెను దాటుకుని వెళ్లడం మిగతా పిల్లలకు అసాధ్యమయ్యేదంటే ఆమె ఎంతటి ప్రతిభావంతురాలో తెలుస్తుంది.
జయలలిత తల్లి ‘వేదవల్లి’ కూడా ఆకర్షణీయమైన రూపంతో అందానికి అర్థం చెబుతున్నట్టుగా ఉండేవారు. ‘సంధ్య’ పేరుతో తెలుగులో ఆమె చాలా సినిమాల్లో నటించారు. నిండైన విగ్రహంతో ఆనాటి ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. వరుస సినిమాలతో తల్లి బిజీగా ఉండటం వలన, చిన్నప్పటి నుంచే జయలలితకు సినిమా వాతావరణం అలవాటైపోయింది. తల్లి ప్రోత్సాహంతో ఆమె కూడా నటన దిశగా అడుగులు వేసింది. వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్టు, చిన్న చిన్న పాత్రలతోనే జయలలిత కెరియర్ మొదలైంది. ‘కానిస్టేబుల్ కూతురు’ .. ‘అమరశిల్పి జక్కన్న’ సినిమాల్లో ఒక డాన్సర్ గా మెరిసిన జయలలిత, ‘మనుషులు మమతలు’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘మనుషులు మమతలు’.. కథానాయికగా జయలలితకు తొలి సినిమా. అప్పటికే స్టార్ హీరోగా తెలుగు తెరను ఏలుతున్న అక్కినేని సరసన లభించిన అవకాశం. అయినా ఆమెలో ఎక్కడా తడబాటు .. తత్తరపాటు కనిపించవు. అప్పట్లో కథానాయికలు స్విమ్ సూట్లో కనిపించడాన్ని ఒక సాహసంగా భావించేవారు. కానీ జయలలిత ఈ సినిమాలో స్విమ్ సూట్లో కనిపించి, మనసున్న కుర్రాళ్లందరినీ మన్మథులుగా మార్చేసింది. ఈ సినిమాలో స్విమ్మింగ్ పూల్లో చిత్రీకరించిన పాటలో ‘సిగ్గేస్తోందా .. సిగ్గేస్తోందా’ అంటూనే తాను సిగ్గులమొగ్గయ్యే తీరును వర్ణించాలంటే మరిన్ని మాటలు వెతుక్కోవలసి వస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ఆమె తెల్ల చేపలా తేలుతూ ఉండే దృశ్యం, ఆనాటి పడుచు హృదయాలను ఇప్పటికీ పట్టుకునే ఉందనడంలో అతిశయోక్తి లేదు.
Must Read ;- చిన్నమ్మ చిటికేస్తే పొలిటికల్ హీట్ పెరుగుతుందా?
ఇక ‘చిన్నడ గొంబే’ సినిమాతో కథానాయికగా కన్నడలోను ఘన విజయాన్ని అందుకున్న జయలలిత, తమిళంలో కథానాయికగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తమిళంలో కెరియర్ ఆరంభంలోనే ఎంజీఆర్ తో చేసిన ‘కన్నితాయి’ సినిమాతో ఆమె పేరు గ్లామర్ కి పర్యాయపదంగా మారిపోయింది. ఈ సినిమాలో తెరపై ఆమెను చూసిన వాళ్లు ఆడపిల్లా? లేడిపిల్లా? అనుకున్నారు. ఆ క్షణమే ఆమె అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమా విజయవంతం కావడంతో, ఎంజీఆర్ సరసన వరుస అవకాశాలు పలకరించాయి. అప్పట్లో ఈ జోడీని అంతా హిట్ పెయిర్ గా చెప్పుకున్నారు. ఆమెను స్టార్ హీరోయిన్ స్థానంలో నిలబెట్టి నీరాజనాలు పట్టారు.
ఇక తెలుగు విషయానికొస్తే అలనాటి అగ్రకథానాయకులైన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబులతో ఆమె నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో ఆమె గ్లామర్ వెలుగు రేఖలా మెరిసిన తీరును .. తేనెవానై కురిసిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఎన్టీఆర్ తో ఆమె చేసిన ‘ఆలీబాబా 40 దొంగలు’ .. ‘ దేవుడు చేసిన మనుషులు’, ఏఎన్నార్ తో చేసిన ‘ఆస్తిపరులు’ .. ‘ అదృష్టవంతులు’ ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఇక కృష్ణతో చేసిన ‘గూఢచారి 116’ .. శోభన్ బాబుతో చేసిన ‘డాక్టర్ బాబు’ సినిమాలు కూడా ఆమె ఖాతాలో భారీ విజయాలను నమోదు చేశాయి. ‘శ్రీకృష్ణ విజయం’ .. ‘శ్రీకృష్ణ సత్య’ వంటి పౌరాణిక చిత్రాల్లోను ఆమె మెప్పించడం విశేషం.
60 వ దశకంలో ఇటు తెలుగు .. అటు తమిళ సినిమాలు చేస్తూ వచ్చిన జయలలిత, 70వ దశకంలో తమిళ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. వరుస సినిమాలు .. వరుస విజయాలు తమిళ ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానాన్ని సుస్థితరం చేశాయి. ఆ సమయంలో తెలుగులో ఆమె చేసిన సినిమాలను వ్రేళ్లమీద లెక్కపెట్టొచ్చు. తెలుగు సినిమాలకి సంబంధించి ‘కోటలోని మొనగాడా .. ‘ .. ‘అల్లా నేరేడు చెట్టుకాడ ..’ .. ‘సిగ్గేస్తోందా .. సిగ్గేస్తోందా ..’ ‘మగవాడివలే ఎగరేసుకుపో .. ‘ .. ‘ఎర్రా బుగ్గలమీద మనసైతే .. ‘ వంటి పాటలు ఎక్కడి నుంచైనా వినిపించినప్పుడు, ఆ పాటల్లో అందంగా మెరిసిన జయలలిత రూపమే కంటి తెరపై కదులుతుంది .. మనసు వేదికపై మెదులుతుంది.
తెలుగు తెరపై నటన పరంగా సావిత్రి .. గ్లామర్ పరంగా జమున .. కృష్ణకుమారి తమ హవాను కొనసాగిస్తున్న రోజుల్లో .., గ్లామరస్ పాత్రల విషయంలో ‘కాంచన’ జోరు చూపుతున్న రోజుల్లో .. జయలలిత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కథానాయిక పాత్ర మోడ్రన్ గా .. గ్లామరస్ గా కనిపించాలంటే ఆ పాత్రకి జయలలిత అయితేనే బాగుంటుందని చెప్పేసి, ఆమె డేట్స్ కోసం ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సైతం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక జయలలితతో కలిసి నటించడం తన ‘కల’ అని అప్పట్లో శోభన్ బాబు తన సన్నిహితులతో అనేవారట. ‘డాక్టర్ బాబు’ సినిమాతో ఆయన ఆ ముచ్చట తీర్చుకున్నాడు. ఇలా ఒక కథానాయికతో కలిసి నటించాలని స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపడం జయలలిత విషయంలో మాత్రమే జరిగి ఉంటుందేమో.
ఎంజీఆర్ కారణంగా తమిళనాట వెండితెరపై ఎదురులేని మహా నాయికగా .. తిరుగులేని మహారాణిగా వెలిగిపోయిన జయలలిత, ఆ తరువాత ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెరపై తెల్ల గులాబీలా .. బుట్టబొమ్మలా కనిపించే జయలలిత, కరకు రాజకీయాలకు భయపడి పారిపోవడం ఖాయమనే చాలామంది అనుకున్నారు. అలాంటి వాళ్లందరి అంచనాలను ఆమె తలక్రిందులు చేసింది. సాహసాలతోనే సావాసం చేస్తూ, ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాలను తన కనుసైగలతో శాసించింది. జయలలిత తన ప్రత్యర్థుల పధకాలను ప్రజా పథకాలతో తిప్పికొట్టిన సమర్థురాలు .. కఠోరమైన పరిస్థితులకు కఠినమైన నిర్ణయాలతో పాఠం చెప్పిన ధీరోదాత్తురాలు .. ఎన్నో విమర్శలను, మరెన్నో వివాదాలను నిబ్బరంగా ఎదురించి నిలిచిన నాయకురాలు.
‘ఊబి’లో మునిగిపోతున్నప్పుడు .. ‘ఉప్పెన’లో కొట్టుకుపోతున్నప్పుడు ఎవరైనా సరే ఎదుటివారి సాయం కోసం ఎదురుచూస్తారు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు భయంతో బేలగా మారిపోతారు. అలాంటి భయం .. బేలతనం జయలలితకి చాలా చాలా దూరం. ఊపిరి ఉన్నంతవరకూ తమిళనాడుకు ఒక వైపున సముద్రం .. మరో వైపున తాను అన్నట్టుగా నిలిచిన ఒంటరి వనిత జయలలిత. అవమానాలు .. మోసాలు .. నమ్మక ద్రోహాలు ఎన్నిమార్లు ఎదురైనా, ఆమె రూపంలో అదే నిండుదనం .. ఆమె నడకలో అదే హుందాతనం .. ఆమె మోములో అదే చిరునవ్వు .. ఆమె కళ్లలో అదే ప్రశాంతత .. అందుకనే ఆమె జయలలిత .. దటీజ్ జయలలిత .. తమిళ ప్రజల గుండెల్లో ‘పురట్చి తలైవి’. ఈ రోజున ఆమె వర్ధంతి. మలయమారుతం వంటి ఆ నాయికను .. మేరుపర్వతం వంటి ఆ నాయకురాలిని ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- తమిళనాట మల్టీస్టారర్ రాజకీయం