డ్రగ్స్ దందాలోకి తనను లాగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారాావు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖుల మెడలకు చుట్టుకున్న డ్రగ్స్ దందాపై మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ ప్రస్తావన వచ్చేలా రేవంత్ రెడ్డి తనదైన శైలి ఒడుపును ప్రదర్శిస్తున్నారు. అయితే రేవంత్ చేసే ఆరోపణలన్నీ కూడా కేటీఆర్ పైనేనని ఆయనతో పాటు జనానికి కూడా ఇట్టే అర్థమైపోతోంది. ఈ క్రమంలో గడచిన కొద్ది రోజులుగా డ్రగ్స్ విషయంపై ట్విట్టర్ వేదికగా రేవంత్, కేటీఆర్ ల మధ్య ఓ రేంజిలో మాటల దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా దాడిలో రేవంత్ ఓ అడుగు ముందుకేసి డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని విసిరారు. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన కేటీఆర్.. రేవంత్ పై ఏకంగా పరువు నష్టం దావా దాఖలు చేశారు.
రేవంత్ కు నోటీసులు
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రేవంత్ రెడ్డికి నోటీసులు జీరా చేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణ తేలేదాకా కేటీఆర్ పై డ్రగ్స్ గానీ, ఈడీ విచారణ అంటూ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కూడా రేవంత్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ కు నోటీసులతో పాటు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. విచారణను వచ్చే నెల (అక్టోబర్) 20కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఈ నోటీసులకు రేవంత్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. తానెప్పుడూ ఈ వివాదంలోకి కేటీఆర్ ను లాగుతూ మాట్లాడలేదని, తానెవరినో అంటే కేటీఆర్ తననే అన్నారనుకుని రియాక్ట్ అయ్యారని, కేటీఆర్ రియాక్ట్ అయ్యాకే తాను కేటీఆర్ పేరును ప్రస్తావించానని రేవంత్ సమాధానం ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిగిలిన వాళ్ల నోళ్లకు తాళమేనా?
కేటీఆర్ పై డ్రగ్స్ కు సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలే చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు తాను సిద్ధమేనని, తన పాదయాత్ర ముగిసిన తర్వాత డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ సందర్బంగానూ కేటీఆర్ పేరును ప్రస్తావించిన బండి.. పరీక్షలకు కేటీఆర్ కూడా సిద్ధం కావాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ పై డ్రగ్స్ గానీ, ఈడీ విచారణలకు సంబంధించి గానీ వ్యాఖ్యలు చేయరాదని రేవంత్ రెడ్డికి సూచించిన నేపథ్యంలో బండి సంజయ్ కూడా కేటీఆర్ పేరును ఈ దందాలోకి లాగుతూ మరోమారు విమర్శలు చేయరేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అక్కడ రేవంత్ బాసూ.. చంద్రబాబు కాదు