ఏపీలో విపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సహనానికి ప్రతిరూపం. క్రమశిక్షణతో రాజకీయం చేస్తున్న నేత. రాజకీయంగా తప్పిస్తే.. పెద్దగా శత్రువులేని లేని నేత కిందే లెక్క. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రాయలసీమలోనూ పుట్టినా.. ఏనాడూ హత్యారాజకీయాలకు తెర తీసిన దాఖలా చంద్రబాబు చరిత్రలోనే కనబడదు. వెరసి చంద్రబాబును అంతా సౌమ్యుడిగానే పిలుస్తారు. అయితే అందరూ చంద్రబాబులా సహనంగా ఉండలేరు కదా. చంద్రబాబు వద్దే రాజకీయ ఓనమాలు దిద్దిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు తత్వానికి పూర్తిగా విరుద్ధం. తనపైకి వచ్చినోళ్లనే కాదు.. అలా ఆలోచించిన వారిని కూడా రేవంత్ ఉపేక్షించలేరు. ఎదురు దాడి కంటే కూడా దాడికే రేవంత్ ప్రాధాన్యమిస్తారు. యువ రక్తంతో ఉరకలెత్తుతున్న రేవంత్ తన అనుచరులకు కూడా అదే నేర్పారనే చెప్పాలి. అటు చంద్రబాబు, ఇటు రేవంత్.. రెండూ భిన్న ధృవాలే. ఈ వాదనకు నిదర్శనంగా అటు విజయవాడలో, ఇటు హైదరాబాద్ లో చోటుచేసుకున్న రెండు ఘటనలు నిలుస్తున్నాయి.
టీఆర్ఎస్ శ్రేణులు పరారు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఇటీవలికాలంలో తనదైన శైలి దూకుడు చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అంటే ఆది నుంచి శత్రువుగానే పరిగణిస్తున్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ పీఠం దక్కిన తర్వాత గులాబీ దళంపై.. ప్రత్యేకించి కేటీఆర్, కేసీఆర్‌లపై తనదైన శైలి దూకుడు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా డ్రగ్స్ వాడుతున్నారన్న కోణంలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఓ రేంజిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మంగళవారం నాడు టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ ఇంటి ముట్టడికి బయలుదేరాయి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చేతబట్టుకుని ఎంట్రీ ఇచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ ఇంటికి చేరుకునే సరికే.. అప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను చూసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు చేతబట్టుకుని రంగంలోకి దిగారు. కర్రలతో టీఆర్ఎస్ కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. ప్రతిఘటిద్దామని చూసిన గులాబీ దళానికి షాకిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా మీడపడబోయారు. దీంతో పలాయనం చిత్తగించక తప్పదని భావించిన టీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉండవల్లిలో టీడీపీపై వైసీపీ దాడి
అయితే గత వారం ఇదే తరహాలో విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన వైసీపీ శ్రేణులు తమను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లపై రాళ్లు, జెండా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పృహ తప్పిపడిపోగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకుని మరీ వైసీపీ శ్రేణులకు సహకరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు అసలు పోలీస్ బాస్ కార్యాలయం లోపలికి అనుమతే లభించలేదు. మొత్తంగా దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డి.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు చుక్కలు చూపిస్తూ ఉంటే.. సహనంతో సాగుతున్న చంద్రబాబు.. తన ఇంటి మీదకు వచ్చిన వైసీపీ శ్రేణులను నిలువరించలేకపోతున్నారు.
Must Read ;- వామ్మో.. యముడిగా రేవంత్











